ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి: జూలకంటి

సూర్యాపేట జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ సమీపంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు.

దేశంలోని 10 శాతం మంది చేతుల్లో 100% సంపద దాగి ఉందని,నరేంద్ర మోడీ పాలనలో పేద,మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతూ పెద్దలకు రాయితీలు కల్పించడం దుర్మార్గమన్నారు.ఆదాని కంపెనీలలో జరుగుతున్న ఆర్థిక మోసాలను హిడెన్ బర్గ్ సంస్థ బట్టబయలు చేసినా విచారణ జరపకపోవడం ఏమిటని ప్రశ్నంచారు.

దేశవ్యాప్తంగా బీజేపీ పాలనకు వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో కలిసి పోరాడుతామని తెలిపారు.కేంద్ర పాలనకు, మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అభ్యుదయ వాదులు,మేధావులు,అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం సృష్టించబడిందని, పాదయాత్రల పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి కొన్ని పార్టీలు మరొకసారి ప్రజలను వంచించాలని చూస్తున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటమన్నారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రచార క్యాంపియన్ చేపడుతామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు,రవి నాయక్,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కోట గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News