తమతో మిత్రపక్షంగా ఉంటూ, అడుగడుగునా తమను అవమానిస్తున్న విధంగా వ్యవహరిస్తున్న బిజేపి వైఖరిపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రగులుతూనే ఉన్నారు.అయినా తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపితో కలిసి ముందుకు వెళ్తున్నారు.
క్రమక్రమంగా బీజేపీకి దూరంగా జరుగుతూ టిడిపికి దగ్గర అయ్యే విధంగా పావులు కదుపుతున్నట్లు గా కనిపిస్తున్నారు.ఇదిలా ఉంటే అకస్మాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించి బిజెపి తీరుపై విమర్శలు చేశారు.
తాము మిత్రపక్షంగా భావించి బిజెపి కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటే, తాము చేసిన త్యాగాన్ని సరిగా గుర్తించక పోగా తమను అవమానించారు అని పవన్ తెలంగాణ బిజెపి పై మండిపడ్డారు. అసలు జనసేన తో తమకు పోత్తే లేదని , ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ బిజెపి సీనియర్ నాయకులు అరవింద్, డీకే అరుణ వంటి వారు మాట్లాడడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
అసలు తెలంగాణ జనసేన మద్దతు కోరలేదని, వారే వచ్చి ఇచ్చారు అని వ్యాఖ్యానించారు.దీనిపై పవన్ ఇప్పుడు స్పందించారు.అది కూడా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పవన్ ఈ విధంగా వ్యాఖ్యానించడం , తెలంగాణ బిజెపి నాయకులకు షాక్ కలిగించింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో పవన్ బిజెపి పై ఈ విధంగా విమర్శలు చేయడం ఎవరికీ అంతుపట్టలేదు.

అసలు తెలంగాణ బిజెపి నాయకులు జనసేన పై ఈ విధమైన వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవి కాదు.చాలా కాలం క్రితమే చేశారు.కానీ అప్పట్లో పవన్ ఈ విమర్శలపై స్పందించలేదు కానీ ఇప్పుడు ఈ విధంగా స్పందించడంతో బీజేపీ ఎంఎల్సి అభ్యర్థి రామచంద్ర రావు సైతం షాక్ కి గురయ్యారు.అదును చూసి పవన్ దెబ్బ కొట్టారు అంటూ తెలంగాణ బిజెపి నాయకులు మండిపడుతున్నారు.
అసలు ఇంత కీలకమైన సమయంలో పవన్ మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేదానిపై పెద్ద చర్చే నడుస్తోంది.తెలంగాణ వ్యవహారాలను అడ్డం పెట్టుకొని ఏపీలో తమకు జరుగుతున్న అవమానం పై పవన్ ఈ విధంగా స్పందించారా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.