ప్రతిపక్ష నేత జగన్ మళ్లీ వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వంపై పోరు కొనసాగించడంలో జనసేనాని పవన్‌కల్యాణ్ దూకుడుతో జగన్ పోటీపడలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయం మరోసారి తెరపైకి వచ్చింది, `పక్కవాళ్లు పోరాడి సాధించుకున్నారు.
మనకేం తక్కువ.మనమూ హోదా కోసం పోరాడదాం` అనే నినాదం రోజురోజుకూ బలపడుతోంది.
అయితే ఈ అంశంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన జగన్.పవన్ కల్యాణ్ కంటే ఒకడుగు వెనకే ఉన్నారనేది విశ్లేషకుల అభిప్రాయం!!
హోదా అంశంలో పవన్ కల్యాణ్ సమరానికి సిద్ధమవుతున్నాడు.
ఇందుకు తొలి అడుగుగా.విశాఖ ఆర్‌కే బీచ్‌లో జరిగే కార్యక్రమానికి మద్దతు ప్రకటించాడు.
ప్రతి విషయంలోనూ ప్రతిపక్ష నేత కంటే ముందుగానే స్పందించి క్రెడిట్ అంతా కొట్టేస్తున్నాడు.దీంతో జగన్ కంటే ఎక్కువగా ఫోకస్ అవుతున్నాడు.
ఏపీకి హోదా ఇస్తానని నమ్మించి వంచించిన బీజేపీని కాకినాడలో సభ నిర్వహించి తీవ్రంగా విమర్శించాడు.తొలి నుంచి హోదా కోసం పోరాడుతున్న నేతగా ప్రజల్లో పేరు కొట్టేశాడు, తర్వాత ఈ విషయంపై జగన్ స్పందించినా ఫోకస్ అంతా పవన్ కల్యాణ్ వైపే తిరుగుతోంది.
రెండున్నరేళ్లుగా ప్రతిపక్ష నేతగా జగన్ ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నారు.ప్రత్యేక హోదా అంశమై మొదట్నుంచీ జగనే పోరాడుతున్నారు.
ఇప్పుడు విశాఖలో యువత చేపడుతున్న ధర్నాకీ మద్దతు ఇచ్చారు.ఇంతచేసినా.
చివరికి క్రెడిట్ మాత్రం దక్కడం లేదు.ఇదంతా చూస్తుంటే ప్రతీ అంశంలోనూ జగన్ ను వెనక్కి నెట్టేందుకు వ్యూహాత్మంగా జరుగుతున్న రాజకీయ కుట్రలా అనిపిస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
అంతేగాక జగన్ ప్రసంగాల్లో వ్యూహాల్లో కొంత మార్పు అవసరమనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల తరఫున పోరాటం కంటే వైకాపా అధికార యావ కాస్త ఎక్కువగా ధ్వనిస్తోందన్న భావన కొంతమందిలో ఉంది.
జగన్ వస్తే తప్ప స్పందించలేని అసహాయత కిందిస్థాయి నాయకుల్లో ఉంది.ఇలాంటి చిన్నచిన్న లోపాలే అవరోధాలుగా మారుతున్నాయి.
జగన్ ఎన్ని ఉద్యమాలు చేపడుతున్నా.చివరి నిమిషంలో అవి వ్యతిరేకంగా మారుతున్నాయని, క్రెడిట్ దక్కడం లేదంటున్నారు.
మరి ఈ విషయంలో జగన్ వైఖరి మారుస్తారో లేదో!!
.