తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది.పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పాటు, ఎక్కడికక్కడ అసంతృప్తి నాయకులు పెరిగిపోతుండటం, పార్టీ మారేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుండటం, మరో వైపు తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ బలమైన పార్టీగా ముద్ర వేయించుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి.
దీనికి తోడు అంతర్గతంగా చేయించిన సర్వేల్లో నూ, నిఘా విభాగాల ద్వారా అందిన రిపోర్ట్ ప్రకారం క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనే విషయం స్పష్టంగా కెసిఆర్ కు తెలిసొచ్చింది.ఎవరు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని రకాల హామీలు ఇచ్చినా, జనాల్లోకి వెళ్లడం లేదని, రాబోయే రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే టెన్షన్ కెసిఆర్ లో స్పష్టం గా కనిపిస్తోంది.
ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలే వీటిని రుజువు చేస్తుండడంతో, ఇక రూట్ మార్చాలని.రాజకీయ ప్రత్యర్ధులకు ఏ విషయంలోనూ అవకాశం దక్కకుండా చేయడంతో పాటు టీఆర్ఎస్ కు రాజకీయం గా ఎదురు లేకుండా చేసుకునేందుకు జనం బాట పట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన మౌఖిక ఆదేశాలు కూడా వెళ్ళాయి.నిత్యం జనాల్లో ఉంటూ జనాలు అవసరాలను తీర్చే వారికి భరోసా కల్పించే విధంగా చేయాలని, జనాల్లో పట్టు సంపాదించలేని వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదు అనే విషయం కెసిఆర్ క్లారిటీ ఇచ్చేయడం తో కొంతమది ఎమ్మెల్యేలు జనాల బాట పట్టారు.
పల్లెలు, పట్టణాలు దేనిని వదిలిపెట్టకుండా తిరుగుతూ, ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి వాటి పరిష్కార మార్గాలను అక్కడికక్కడే వెతికే పనిలో ఉన్నారు.

మరి కొందరు నియోజకవర్గం లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రతిరోజూ శుభోదయం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ప్రజా సమస్యలను తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మంత్రి సబితా ఇంద్రా రెడ సైతం తన నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించారు.
అధికారులతో కలిసి ప్రతి సోమవారం ప్రజల ముందుకు వెళ్తున్నారు.ఇక మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే రూట్లో వెళ్లి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసుకునే విషయంపై దృష్టి పెట్టారట.