తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు హుజురాబాద్ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి.ఇక్కడ గెలిస్తేనే తమకు , తమ ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదని , లేకపోతే ఈ ఎన్నికల ఫలితాలు 2023 ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి అనే ఆందోళన అధికార పార్టీలో నెలకొంది.
అందుకే ఈ ఎన్నికలను ఇంత ప్రతిష్టత్మకంగా తీసుకోవడంతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరికీ హుజూరాబాద్ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించారు. వీరే కాకుండా మంత్రి హరీష్ రావు పూర్తిగా ఈ పనిలో నిమగ్నమయ్యారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్థి గా పోటీలో ఉన్న ఈటెల రాజేందర్ కు కంచుకోట గా ఉండడంతో టిఆర్ఎస్ ఇంతగా టెన్షన్ పడుతోంది.కేవలం టిఆర్ఎస్, బిజెపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది అనుకున్న కాంగ్రెస్ కూడా , ఇప్పుడు దూకుడుగా ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది.
అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తారని ముందుగా హడావుడి నడిచినా, ఆయన కాకుండా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
ఈ నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ ను కలిసే విధంగా టిఆర్ఎస్ ఇప్పటికే ప్లాన్ చేసుకుంది.
ఇదే కాకుండా టిఆర్ఎస్ కు మరింత గా ఈ నియోజకవర్గంలో పట్టు పెరగాలంటే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఖచ్చితంగా కెసిఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అప్పుడే ఒక ఊపు వస్తుందనేది ఆ పార్టీ క్యాడర్ అభిప్రాయం.అంతేకాకుండా ప్రజల అభిప్రాయం ఏవిధంగా ఉందనేది ఈ బహిరంగ సభ ద్వారా తెలిసే అవకాశం ఉందనేది టిఆర్ఎస్ అంచనా అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటం , భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనేక నిబంధనలు విధించడంతో ఏం చేయాలనే విషయంపై టిఆర్ఎస్ ఆలోచనలో పడింది.
ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభ కు అనుమతి ఇవ్వాలి అని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వెయ్యి మంది కి నుంచి ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనకూడదు.
దీంతో టీఆర్ఎస్ ఆలోచనలో పడింది.

తెలంగాణలో పెద్ద గా కరోనా వైరస్ యాక్టివ్ కేసులు లేవని, భారీ బహిరంగ సభకు జనాలను పరిమితం చేసే నిబంధనలు సడలించాలని టిఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కోరుతోంది.భారీ బహిరంగ సభ నిర్వహించి, విజయవంతం చేయడం ద్వారా టీఆర్ఎస్ విజయావకాశాలు మెరుగు అవుతాయి అనే లెక్కల్లో టీఆర్ఎస్ ఉంది.