అధికారం కోల్పోయాక టీడీపీ కష్టాల్లో పడిపోయిన విషయం తెలిసిందే.అసలే ఘోరంగా ఓడిపోవడం, అధికారంలోకి వచ్చిన జగన్ దూకుడుగా ఉండటంతో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది.
ఓ వైపు జగన్ అద్భుతమైన సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంటే, మరోవైపు చంద్రబాబు ఇమేజ్ రోజురోజుకూ పడిపోతుంది.
ఎన్నికలయ్యి 20 నెలలు దాటిన టీడీపీ ఇంకా పుంజుకోలేకపోతుంది.
అందుకే టీడీపీలో ఉన్న పలువురు నాయకులు తమ దారి తాము చూసుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇక మరికొందరు వైసీపీలోకి జంప్ కొట్టొచ్చని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కూడా వైసీపీ వైపుకు వెళ్లొచ్చని తెలుస్తోంది.2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కిడారి సర్వేశ్వరావు అరకు ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే.

అయితే నక్సలైట్ల కాల్పుల్లో సర్వేశ్వరావు చనిపోయారు.దీంతో చంద్రబాబు, సర్వేశ్వరావు తనయుడు శ్రవణ్‌కు మంత్రి పదవి ఇచ్చారు.అయితే శ్రవణ్‌కు ఎమ్మెల్యే పదవిగానీ, ఎమ్మెల్సీ పదవిగానీ లేకపోవడంతో, ఆరు నెలలకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇక 2019 ఎన్నికల్లో శ్రవణ్ టీడీపీ తరుపున అరకు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.అటు టీడీపీ కూడా అధికారంలోకి రాకపోవడంతో శ్రవణ్ సైలెంట్
అయ్యారు.
ఇక మధ్య మధ్యలో పార్టీలో కనిపించి, అధికార వైసీపీపై విమర్శలు చేసిన శ్రవణ్, గత కొంతకాలంగా పార్టీలో కనిపించడం లేదు.పైగా ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు.
తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టి దాదాపు రెండు నెలలు అయిపోతుంది.దీనికి తోడు శ్రవణ్ వైసీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని, త్వరలోనే బాబుకు షాక్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది.
ఇక ఈ పరిణామాలు బట్టి చూసుకుంటే ఈ యువ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇవ్వడం దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది.