ఏపీ సీఎం జగన్ అందరివాడు గానే ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు.అన్ని సామాజిక వర్గాల అండదండలు పుష్కలంగా ఉండాలని ఆయన భావిస్తూ, దానికి అనుగుణంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పరిస్థితులను కల్పిస్తూ వస్తున్నారు.
ఇక ఏపీలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగానే సినీ పరిశ్రమకు చెందిన వారు ఉంటూ వచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ సినీ రంగానికి చెందిన వారు కావడంతో, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్ ఉంటూనే వచ్చింది.
తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఎన్నికల్లోనూ సినీ రంగానికి చెందిన వారు పాల్గొంటూ, టిడిపి గెలుపునకు బాటలు వేసేవారు.ఎన్టీఆర్ కే కాకుండా, చంద్రబాబు హయాంలోనూ, టీడీపీకి సినీ పరిశ్రమ మద్దతు ఉంటుంది వచ్చింది.

కానీ 2014 తరువాత ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టినా, మెజారిటీ సినీ జనాలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ వైపే నిలబడ్డారు.జగన్ కు మద్దతుగా మాట్లాడుతూ వచ్చేవారు.2019 ఎన్నికలకు ముందు ఇతర పార్టీల్లో ఉన్న సినీ నటులు చాలామంది జగన్ కు జై కొట్టారు.ఆయన పాదయాత్ర సమయంలో అనేకమంది సినీ జనాలు పాల్గొంటూ వచ్చేవారు.
ముఖ్యంగా జయసుధ, మోహన్ బాబు, అలీ, పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్, జీవిత రాజశేఖర్, నాగార్జున అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతో మంది సినీ జనాలు జగన్ కు బహిరంగంగా మద్దతు పలకడం తో పాటు, చాలా మంది వైసీపీ కండువా కప్పుకున్నారు.కానీ ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అప్పుడు మద్దతు పలికిన సినీ జనాలు మాత్రం బాగా సైలెంట్ అయిపోయారు.

జగన్ తో అంటీ ముట్టనట్టుగా ఉంటూ వస్తున్నారు.పైగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా ఉండేందుకు సినీ జనాలు తాపత్రయ పడుతున్నారు.విశాఖలో సినిమా స్టూడియో ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున భూములు కేటాయిస్తామని ఏపీ ప్రభుత్వం ఆఫర్ ఇస్తున్నా, పెద్దగా ఎవరు స్పందించడం లేదు.అసలు హైదరాబాద్ వదిలి వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు.
దీనికి కారణం ఏపీలో తలెత్తుతున్న పరిస్థితులు, ప్రధానంగా ఒక సామాజిక వర్గం టార్గెట్ గా జగన్ వ్యవహరిస్తున్నారని, అదే సామాజిక వర్గానికి చెందిన సినీ పరిశ్రమ వారు ఎక్కువగా ఉన్న నేపథ్యం, ఇలా అనేక కారణాలతో జగన్ కు దూరంగానే సినీ నటులు ఉంటూ వస్తున్నారట.