మన సనాతనమైన భారతదేశంలో ఎన్నో దేవాలయాలకు ప్రసిద్ధి చెందినది.ప్రతి దేవాలయములో ఏవో వింతలు, ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.
కొన్ని దేవాలయాలలో దాగి ఉన్న రహస్యాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు.ఆ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక ఆలయాలలో ఒరిస్సాలోని కోణార్క్ సూర్య భగవానుడి ఆలయం ఒకటని చెప్పవచ్చు.
కోణార్క్ ఆలయం ఏ విధంగా స్థాపించబడినది, ఈ ఆలయంలోని విగ్రహం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పురాతన కాలంలో శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చుని ఆ సూర్య భగవానుని స్మరిస్తూ తపస్సు చేసాడు.
ఈ క్రమంలోనే సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది.ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోణార్క్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్టించాడు.
అయితే ప్రస్తుతం కోణార్క్ ఆలయంలో సాంబుడు ప్రతిష్టించిన విగ్రహం లేదు.ఇప్పటికి కూడా ఆలయంలో ప్రతిష్టించిన సూర్యభగవానుడి విగ్రహం ఏమైందో ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది.

ప్రస్తుతం కోణార్క్‌లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు.అప్పట్లో కోణార్క్ ఆలయాన్ని దాదాపు 12 వేల మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయాన్ని సూర్యుని రథం వలె ఆలయానికి రెండువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి.అదేవిధంగా వారంలోని ఏడు రోజులను సూచించే విధంగా ఆలయానికి ఏడు గుర్రాలు చెక్కబడి ఉన్నాయి.
ఈ ఆలయంలో ఉన్న చక్రాలపై పడే సూర్యకిరణాలు ఆధారంగా అక్కడి స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని లెక్కిస్తారు.మరొక విషయం ఏమిటంటే ఈ ఆలయానికి చెక్కబడి ఉన్న చక్రాలు సూర్యుడు పరిభ్రమణాన్ని తెలియజేస్తాయి.
ఇప్పటికీ ఆలయంలో విగ్రహం లేకపోవడం ఒక విశేషం.కానీ ప్రతియేటా రథసప్తమి వేడుకలప్పుడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.