వర్క్ ఫ్రమ్ హోమ్‌లో మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన గూగుల్.. ఉద్యోగులకు రూ.75 వేలు

ప్రపంచంలోనే అత్యుత్తమ పని వాతావరణంతో పాటు ఉద్యోగుల సంరక్షణకు అత్యధిక నిధులను ఖర్చు చేసే సంస్ధగా పేరొందిన ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన మంచి మనసును మరోసారి రుజువు చేసుకుంది.

కరోనా నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన గూగుల్ వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆదేశాలు ఇచ్చింది.

అయితే అమెరికాతో పాటు పలు దేశాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో దశల వారీగా కార్యాలయాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది.జూలై 6 నుంచి మరిన్ని నగరాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు.

దీనితో పాటు ఉద్యోగులకు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఈ ఏడాది చివరి వరకు చాలా మంది ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన పరికరాలు, ఫర్నీచర్ ఖర్చుల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి 1,000 డాలర్లు ( భారత కరెన్సీలో రూ.75,000) ఇస్తున్నట్లు ప్రకటించారు.లావాదేవీల నేపథ్యంలో కొంతమంది అత్యవసర ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉందని పిచాయ్ అన్నారు.

జూన్ 10 లోగా సంబంధిత అధికారులు.ఉద్యోగులకు సమాచారం అందిస్తారని, వారు వీలైతే ఆఫీసుకు రావడం, లేనిపక్షంలో ఇంటి నుంచి పని కొనసాగించవచ్చని తెలిపారు.

Advertisement

వారి వారి సామర్ధ్యాలను బట్టి తిరిగి రావాలనుకునే వారికి పరిమితంగా అనుమతిస్తున్నట్లు పిచాయ్ వెల్లడించారు.వీరు మినహా మిగిలిన అందరికీ డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం అందుబాటులో ఉంటుందని గూగుల్ సీఈవో వెల్లడించారు.రొటేషన్ పద్ధతిలో ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేలా ప్రతి రెండు వారాలకు ఒక రోజు ఆఫీసుకు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శకాల ప్రకారం గూగుల్ కార్యాలయాల్లో సామాజిక దూరం, పరిశుభ్రత లాంటి కఠినమైన ఆరోగ్య, భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అందువల్ల కార్యాలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయని సుందర్ పిచాయ్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు