తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఉండే డిమాండ్ ను డబ్బు చేసుకోవడానికి కొంతమంది అక్రమదారులు మోసాలకు పాల్పడుతున్నారు.ఇలా మోసాలు చేయడానికి శ్రీవారి భక్తులను టార్గెట్ చేసుకున్నారు.
తిరుమలకు రవాణతో పాటు దర్శనం, వసతి, భోజనం కల్పిస్తామంటూ ప్యాకేజీలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి.ఎంతో అదృష్టం ఉంటే కానీ శ్రీవారి దర్శనం లభించని ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు కూడా ఈ ఆఫర్లను నమ్ముతున్నారు.
నిజమా కాదా అనే తెలుసుకునే ప్రయత్నంలో కొందరు ఉంటే, మరికొందరు నగదు చెల్లించి మోసపోతున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా శ్రీవారి దర్శనానికి టీటీడీ ప్రతినెలా ఆన్లైన్లో 300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తూ ఉంది.
అర్జిత సేవలు అంగప్రదక్షిణ, సీనియర్ సిటిజన్ల కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తిరుపతి బాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ లేదా ‘టీటీదేవస్థానమ్స్ దేవస్థానం అనే మొబైల్ యాప్ ద్వారా విడుదల చేస్తూ ఉంది.

అయితే ప్రస్తుతం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఆన్లైన్లో విడుదల చేస్తున్న టికెట్లు క్షణాల్లో బుక్ చేసుకుంటున్నారు.దీనివల్ల దర్శన టికెట్లు లభించని భక్తులు వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తూ కొంతమంది మోసగాళ్ల చేతులలో మోసపోతున్నారు.ఇందులో భాగంగానే ఇటి వాల ఒక సంస్థ పేరుతో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్ కు ప్రత్యేక హెలికాప్టర్లో తీసుకుని వెళ్తామని అక్కడి నుంచి కారులో తిరుమలకు తీసుకెళ్లి బస కల్పించడంతో పాటు బ్రేక్ దర్శనం కల్పిస్తామని దీనికోసం ఒక్కరికి 98,999 చెల్లించాలని పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అయింది.అలాగే తిరుమల తిరుపతి క్షేత్ర దర్శనం ట్రస్ట్ పేరుతో సంవత్సరంలో ఏడుసార్లు శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఈ ఏడు రోజులు వసతి కల్పించడంతో పాటు తిరుమల తిరుపతికి బస్సు టికెట్లను కూడా అందజేస్తామని ఒక సంస్థ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది.చాలా మంది భక్తులు ఇలాంటి పోస్టులను చూసి వారి నెంబర్లకు కాల్ చేసి మోసపోతున్నట్లు తెలుస్తోంది.
కాబట్టి ఇటువంటి వాటిని నమ్మకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.