చలికాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే పాదాలు పగలటం మాత్రం జరుగుతూనే ఉంటుంది.పాదాల పగుళ్లు కొంచెం కనపడగానే ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం కనపడుతుంది.
కానీ చాలా మంది పాదాల పగుళ్లు కనపడగానే ఆయింట్ మెంట్ కోసం చూస్తారు.అలాంటి వారు ఈ చిట్కాలను చుస్తే ఇక ఆయింట్ మెంట్ జోలికి వెళ్ళరు.
ఈ ఇంటి చిట్కాలు అంత బాగా సమర్ధవంతంగా పనిచేస్తాయి.వాటి గురించి తెలుసుకుందాం.
శనగ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, కొబ్బరి నూనె.నువ్వుల నూనె వంటి వంట నూనెలలో ఏదైనా ఒక దానిని రాత్రి పడుకొనే ముందు కాళ్లకు రాసి మర్దన చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.మర్దన చేయటానికి కూడా ఒక పద్దతి ఉంది.పాదాలను మురికి వదిలే వరకు బాగా కడిగి శుభ్రంగా తుడిచి ఆ తర్వాత నూనె రాసి మర్దన చేసి సాక్స్ వేసుకోవాలి.
ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.
బియ్యపిండి మంచి స్క్రబ్ గా పనిచేస్తుంది.
బియ్యంపిండికి కొన్ని చుక్కల తేనే,యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి పేస్ట్ చేయాలి.పాదాలను గోరువెచ్చని నీటిలో అరగంట నానబెట్టి ఆ తర్వాత బియ్యంపిండి పేస్ట్ రాసి బాగా రుద్ది శుభ్రంగా కడగాలి.
వేపలో యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన పాదాల పగుళ్లను వదిలించటంలో బాగా సహాయపడుతుంది.గుప్పెడు వేప ఆకులలో కొంచెం పసుపు వేసి మెత్తని పేస్ట్ చేయాలి.ఆ పేస్ట్ పగిలిన పాదాలకు రాసి ఆరిన తర్వాత పొడిగా తుడిచి నూనెతో మర్దన చేయాలి.
గోరింటాకు ను రుబ్బి పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే పాదాల పగుళ్ళకు చెక్ పెట్టవచ్చు.బొప్పాయి పేస్ట్ లో కొంచెం పసుపు కలిపి రాసుకున్నా మంచి ఫలితం కనపడుతుంది.
ఆముదం,కొబ్బరి నూనె సమాన భాగాలలో తీసుకోని దానిలో కొంచెం పసుపు కలిపి పగిలిన పాదాలకు రోజు రాసి మర్దన చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.
ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి
.