హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కొద్ది రోజుల క్రితమే హుజూరాబాద్ నియోజకవర్గం లో పాదయాత్ర చేపట్టి, తన పరపతి పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.నియోజకవర్గంలోని ప్రతి పల్లెను టచ్ చేసే విధంగా రాజేందర్ పాదయాత్ర షెడ్యూల్ రూపొందించుకున్నారు.
గత కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గం అంతా పాదయాత్ర ద్వారా పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ , తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే 12 రోజులుగా చేపట్టిన పాదయాత్రను రాజేందర్ అర్ధాంతరంగా ముగించారు.ఈ పన్నెండు రోజుల్లో దాదాపు 222 కిలోమీటర్లు ఆయన పర్యటించారు.
అయితే ఈ పాదయాత్ర కారణంగా సమయానికి తినలేకపోవడం, నిద్ర లేమి, ఇలా అనేక సమస్యలతో ఆయనకు షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు, జ్వరం రావడం, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం, నడవలేని పరిస్థితి ఏర్పడడం, తదితర కారణాలతో రాజేందర్ తన పాదయాత్ర ను నిలిపివేశారు.

వైద్యుల సలహా మేరకు ఆయన హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు.దీంతో రకరకాల ఊహాగానాలు, సెటైర్లు మొదలయ్యాయి.రాజేందర్ ఇక పాదయాత్ర చేపట్టే అవకాశమే లేదని, ఆయన పాదయాత్ర ను నిలిపివేసేందుకు ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో రాజేందర్ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉండడం, ప్రజలలోనూ ఈ విషయంపై చర్చ జరుగుతూ ఉండడంతో రాజేందర్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.” 12 రోజులుగా, 222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతి క్షణం నా వెన్నంటే నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం.వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి.

కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది.ఆరోగ్యం సహకరించగానే, ప్రజా దీవెన యాత్ర మళ్లీ పున ప్రారంభం అవుతుంది.ఆగిన చోటు నుంచి అడుగులు మొదలవుతాయి.కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజా దీవెన యాత్రతో వస్తా ” అంటూ రాజేందర్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.