సాధారణంగా మనం మనుషులను బెదిరించడం చూస్తుంటాము.కానీ పరమేశ్వరుడిని బెదిరించిన భక్తులను మీరెక్కడైనా చూశారా? ఆ విధంగా పరమేశ్వరుడిని బెదిరించిన భక్తుడు రుద్ర పశుపతి అనే గొప్ప భక్తుడు ఉండేవాడు.రుద్ర పశుపతి అనే వ్యక్తి గొప్ప శివ భక్తుడు, అమాయకుడు.ఇతను శివుడి పై ఉండే భక్తి వల్ల ప్రతి రోజు శివాలయానికి వెళ్లి అక్కడ పురాణాలు, శివుని కథలు వినేవాడు.
ఎవరు ఏ కథ చెప్పిన దానిని నిజమేనని భావించి నమ్మేవాడు.అదే విధంగా ఒకరోజు శివాలయంలో హరికథా కాలక్షేపం జరుగుతోంది.ఈ హరికథలో భాగంగా క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు సేవించినట్లు అది శివుడి కంఠంలోనే ఉండిపోవడం వల్ల శివునికి నీలకంటేశ్వరడు అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు.
అక్కడే ఉండి ఈ కథ వింటున్న రుద్ర పశుపతి ఇది నిజమేనని భావించి అయ్యో ఇంత మంది ఉండగా ఆ విషాన్ని శివుడికి ఎందుకు ఇచ్చారు.
పాపం శివుడు ఆ విషాన్ని కంఠంలో ఉంచుకొని ఎంత బాధ పడుతున్నాడో కదా అంటూ వేగంగా శివాలయంకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్వామి దగ్గరకు వెళ్లి నువ్వు విషం మింగావట కదా అలా ఎందుకు మింగావు వెంటనే ఆ విషయం ఉమ్మెయ్యి అంటూ శివుడిపై మారాం చేస్తున్నాడు.ఎంతసేపటికి స్వామి వారు విషం ఉమ్మక పోవడంతో ఒక పదునైన కత్తిని తీసుకుని తన మెడ దగ్గర పెట్టుకొని స్వామి వారిని బెదిరించి సాగాడు.

నువ్వు విషం బయట పడేస్తావా లేకపోతే నా కంఠాన్ని ఈ కత్తితో నరికేసుకుంటానంటూ స్వామివారిని బెదిరించసాగాడు.ఆ అమాయక భక్తుడిని చూసిన శివుడు నిజంగానే అన్నంత పని చేస్తాడని భావించి అతని భక్తికి ప్రత్యక్షమైన ఆ పరమశివుడు తన భక్తుడిని తనలో ఐక్యం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.