గెలుపు పై ప్రతి పార్టీకి ధీమా ఉంది.అలాగే ప్రతి పార్టీకి అనుమానం కూడా ఉంది.
అదే సమయంలో హంగ్ వస్తుందన్న ఆందోళన కూడా ఉంది.అందుకే ప్రతి పార్టీ తమ తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి.
వైసీపీ అధికారంలోకి వస్తుందన్న సర్వేలను చూసి బాబు ఒక పక్క ఆందోళన చెందుతూనే మరోపక్క తమ పార్టీ అభ్యర్థులు ఎవరూ వైసీపీలో కి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.దీనిలో భాగంగానే పార్టీ అభ్యర్థుల కదలికలపై గుట్టుచప్పుడు కాకుండా నిఘా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
అభ్యర్థులే కాకుండా వారి ఆంతరంగికుల ఫోన్ సంభాషణలను, ట్యాప్ చేసి వింటున్నారా? అనే చర్చ ఇప్పుడు పార్టీలోనే పెద్ద ఎత్తున వినిపిస్తోంది.ఈ విషయం బయటకి పొక్కడంతో బాబు మమ్మల్ని నమ్మడం లేదా అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామా లేదా అనే సందేహం ఒక వైపు పట్టి పీడిస్తుంటే మరోవైపు తమ పార్టీ అధినేతే తమ కార్యకలాపాల మీద నిఘా ఏర్పాటు చేయడం ఎవరికి మింగుడుపడడంలేదు.శుక్రవారం ఉదయం రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు చేపట్టారు.
ఇంతకాలం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు.కుట్రలు చేశారు అంటూ బాబు చేసిన హంగామా వల్ల టీడీపీలో తాము ఓడిపోబోతున్నాము అనే భయం కూడా ఎక్కువయిపోయింది.
అందుకే ఆ భయాన్ని పోగొట్టేందుకు టీడీపీ గెలవబోతోంది, 150 సీట్లు రాబోతున్నాయి అంటూ బాబు క్యాడర్లో ధైర్యం నూరిపోసే పనిలో ఉన్నాడు.

ఈ సందర్భంగా తమ పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులతో వైసీపీ నాయకులు టచ్ లో ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క అభ్యర్థి చేజారిపోకుండా చూడాలని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు.ఇంతకీ వైసీపీ నేతలకు టీడీపీ అభ్యర్థులు టచ్ లోకి వెళ్తున్నారు అని అనుమానించడానికి సీక్రెట్ గా వారి వారి ఫోన్ సంభాషణలు వినడమే కారణం అని తెలుస్తోంది.అందుకే అంత ఖచ్చితంగా వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థులకు ఎర వేస్తున్నారనే విషయాన్ని బాబు చెప్పగలుగుతున్నాడు.
తన నీడను కూడా నమ్మదనే పేరున్న చంద్రబాబు సొంత పార్టీ నాయకులను, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులను నమ్ముతాడనుకోవడం అత్యాశే.