ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ తమ దృష్టి మొత్తం ఇక్కడే ఫోకస్ చేసింది.తెలంగాణాలో తమకు బలం బలగం ఉన్నా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో ఆశలు వదులుకుంది.
అప్పటివరకు పార్టీలో ఉన్న వారు చాలామంది అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిపోగా కొంతమంది మాత్రం తటస్థంగా ఉండిపోయారు.అదీకాకుండా తెలంగాణాలో రెడ్డి సామాజిక వర్గం మెజార్టీ స్థాయిలో ఉన్నారు.
వారంతా జగన్ కు అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలబడుతున్నారు.అయినా జగన్ మాత్రం అక్కడ పార్టీ ఉనికి కాపాడే విషయంలో పెద్దగా దృష్టిపెట్టలేదు.
ప్రస్తుతం తెలంగాణాలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీల్లోనూ కాక రేపుతోంది.నువ్వా నేనా అన్నట్టుగా అన్ని పార్టీలు తలపడుతున్నాయి.
ఆఖరికి తెలంగాణాలో ఉనికే కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది.ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఇక్కడ పోటీకి దిగాలని ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.
హుజుర్‌నగర్ విషయానికి వస్తే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండడంతో పాటు బలమైన ఓటింగ్ ఉంది.వారంతా మొదటి నుంచి కాంగ్రెస్ వైపే ఉంటూ వస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కనుక అక్కడ అభ్యర్థిని నిలబెడితే ఆ సామజిక వర్గం ఓటింగ్ బలంగా చీలే అవకాశం ఉంది.ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
దీని కారణంగా ఇక్కడ తమ బలాన్ని చూపించడంతో పాటు అటు కాంగ్రెస్‌కు చెక్ పెట్టి మిత్రుడైన సీఎం కేసీఆర్‌కు పరోక్షంగా మేలు చేసే ఉద్దేశం కూడా కనిపిస్తోంది.

మొదటగా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా పోరు కొనసాగుతుండగా బీజేపీ, టీడీపీ, సీపీఎం కూడా ఈ స్థానంపైనా కన్నేశాయి.ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరు ఇప్పటికే ప్రకటించారు.కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పోటీలో ఉన్నారు.
ఇక టీడీపీ తమ అభ్యర్థిగా మాజీ జెడ్పీటీసీ చావా కిరణ్మయిని దించింది.ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కిరణ్మయికి బీఫామ్ కూడా ఇచ్చారు.
అలాగే బీజేపీ నుంచి మాజీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు కోట రామారావు పోటీకి దిగుతున్నారు.
సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్ పోటీ చేస్తున్నారు.ఇక టీఆర్ఎస్ ఇప్పటికే సీపీఐ మద్దతు కోరగా సీపీఐ అందుకు దాదాపు ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డికి 27 వేల ఓట్లు వచ్చాయి.ఆ ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ మూడో స్థానంలో నిలింది.
ఈ లెక్కన ఇక్కడ వైసీపీ అభ్యర్థిని రంగంలోకి దించితే కాంగ్రెస్ ఖాతాలో పడాల్సిన ఓట్లు భారీగా చీలి టీఆర్ఎస్ కు మేలు జరుగుతుందన్న భావనలో వైసీపీ ఉన్నట్టు కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని రంగంలోకి దించే విషయంలో పార్టీ నేతలలతో జగన్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
.