హత్రాస్ లో మరో దారుణం

ఉత్తరప్రదేశ్ లో కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.

హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిఫై అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది.అభం శుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారిపై తన సమీప బంధువైన 15 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడటంతో తీవ్రగాయాలపాలైన చిన్నారి సోమవారం కన్నుమూసింది.సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణ ఘటనతో యావత్ భారత దేశం మరోసారి ఉలిక్కిపడింది.

హత్రాస్ జిల్లాకు చెందిన ఆరేళ్ల మైనర్ బాలికను అలీఘడ్ జిల్లాలోని ఇగ్లాస్ ప్రాంతానికి చెందిన తన సమీప బంధువు బంధించి అత్యాచారానికి పాల్పడున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు, గత నెల 17న బాలికను ఆ కామాంధుని చెర నుంచి రక్షించి అలీఘడ్ లోని జవహర్ లాల్ నెహ్రు మెడికల్ కాలేజీ ఆసుపత్రి లో చేర్పించారు.నాలుగు రోజుల క్రితం బాలిక పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాల బారిన పడ్డ చిన్నారి కోలుకోలేక కన్నుమూసింది.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గత నెల 21న కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దురాఘతానికి పాల్పడిన నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నిందితుడు నేరాన్నిఅంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

అయితే ఈ దుశ్చర్యకు పాల్పడటంలో నిందితుడికి బాలిక పిన్ని సహకరించినట్టు పోలీసులకు ముందుగానే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.తన మరో కూతురు కూడా మేనత్త చెరలోనే ఉందని, ఆ అమ్మాయినైనా కాపాడాలని పోలీసులను ప్రాధేయపడటం అందరిని కలచి వేసింది.

బాలిక పిన్ని ప్రస్తుతం పరారీలో ఉంది.కేసు నమోదు విషయం దగ్గర నుండి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలి బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.తమకు న్యాయం జరిగే వరకు చిన్నారి మృతదేహానికి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించేదిలేదని వారు భీష్మించుకు కూర్చున్నారు.

హత్రాస్ లోని జాతీయ రహదారిపై వారు చిన్నారి మృతదేహంతో పాటు నిరసనకు దిగారు.

తాజా వార్తలు