చావనైనా చస్తాం కానీ,మా భూములు వదులుకోము

నల్లగొండ జిల్లా:కనగల్ మండలంలోని జి.ఎడవెల్లి గ్రామానికి చెందిన పేద రైతులు నల్లగొండ కలెక్టరేట్ ముందు చేపట్టిన ధర్నా కార్యక్రమ రెండవ రోజుకు చేరుకుంది.

గ్రామంలో పల్లె ప్రకృతి వనం పేరుతో అధికారులు పేదల భూములను లాక్కోవడంతో దాదాపు 25 రైతు కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం తెలిసిందే.అనేక రూపాల్లో తమ నిరసనను తెలిపిన రైతులు,అనేక మంది ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గతంలో ఏఎమ్ఆర్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కట్టడం కోసం తమ భూముల్లో మట్టిని తరలించేందుకు అయిదేళ్లు లీజుకి కావాలని చెప్పి,తమ వల్ల కొన్ని లక్షల మందికి అన్నం దొరుకుతుందని మమ్ములను ఒప్పించి దాదాపు 44 ఎకరాల భూమి తీసుకొని,ఒక సంవత్సర కాలంలోనే ప్రాజెక్టు పూర్తి చేశారని, అనంతరం ఆ భూములలో ఇక నుండి మీరు వ్యవసాయం చేసుకోవచ్చని చెప్పి వెళ్లిపోయారని గుర్తు చేశారు.అప్పటి నుండి 2021 వరకు ఆ భూములు తమ పేర్ల మీదనే ఉన్నాయని,అందులో కొందరు అమ్ముకున్నారని,మరికొందరు బిడ్డల పెళ్లిళ్లకు పసుపు కుంకుమ కింద ఇచ్చారని,ఇంకొంతమందికి కేసీఆర్ కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చి,రైతుబంధు కూడా వచ్చిందని తెలిపారు.

ఆ భూముల్లో వ్యవసాయం చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై ఎవరి కన్ను పడిందో ఏమో,లేక నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి తామేమీ అన్యాయం చేశామో తెలియదు కానీ,తమ భూమి మొత్తం ఇప్పుడు ప్రభుత్వం పేరుమీద మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ భూమిలో వేసిన పంటను మొత్తం జేసీబీలతో తొక్కించి పాడుచేశారని వాపోయారు.

Advertisement

తమ భూముల్ని అక్రమంగా లాక్కోవడంతో అడ్డుకున్న మమ్మల్ని కూడా ఆడా,మగా చూడకుండా అందరిని తీసుకెళ్లి కనగల్ పోలీసు స్టేషన్ లో వేశారని చెప్పారు.ఇదే విషయమై అక్రమంగా తమ భూములను ఎందుకు గుంజుకున్నారని జిల్లా కలెక్టర్ మరియు స్థానిక తహశీల్దార్ ని అడిగితే పైనుండి ఒత్తిడి ఉందని,తామేమీ ఏం చేయలేమని చెబుతున్నారని అన్నారు.

ఈ విషయంలో ఎవ్వరిని అడిగినా తమకు న్యాయం జరగడం లేదని ఆదివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టామని తెలిపారు.ప్రాణాలైనా వదులుకుంటా కానీ,భూములు మాత్రం వదిలేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దాదాపు 44 ఎకరాల భూమిని పల్లె ప్రకృతి వనం పేరిట గుంజుకొని,ఒక మూడు ఎకరాలలో మాత్రమే పల్లె ప్రకృతి వనం పెట్టి అందులో కేటీఆర్ జన్మదిన వేడుకలు కూడా చేసుకోవడం జరిగిందని,కానీ,తమ మీద మాత్రం దయ చూపడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి చట్టం ప్రకారం తమకు సంక్రమించిన భూములను తమకు అప్పగించి ఆదుకోవాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరై బాధిత రైతులకు సంఘీభావం తెలిపారు.

పైలట్ ప్రాజెక్టు భూ సర్వే ఎల్లాపురం శివారులో షురూ
Advertisement

Latest Nalgonda News