వైసిపి 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తునే ఉన్నారు.ఎవరి ఊహకు అందకుండా రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తూ, జగన్ ప్రతి విషయంలోనూ తనదే పైచేయిగా ఉండేలా చూసుకుంటూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజంగా జగన్ నిర్ణయాలతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అతలాకుతలం అయిపోయింది.ఇప్పటికే పార్టీ కేడర్ చెల్లాచెదురు కాగా, మిగిలిన నేతలు ఆందోళన లోనే ఉన్నారు .వారిని కాపాడుకునేందుకు రకరకాల ఎత్తుగడలు టిడిపి అధినేత చంద్రబాబు వేస్తూనే ఉన్నారు.
ఈ విధంగా జగన్ తమ రాజకీయ ప్రత్యర్థులను లబోదిబో అనేలా చేస్తుండగా, ఇప్పుడు జగన్ నిర్ణయాల కారణంగా సొంత పార్టీ కేడర్ కూడా లబోదిబో అనే పరిస్థితి వచ్చింది .ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన దాదాపు 90% మంది ప్రజాప్రతినిధులు జగన్ చేసిన కొన్ని వ్యవహారాల కారణంగా ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడంతో పాటు, కొత్తగా సొంత నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తరఫున భారీగా సొమ్ము లు పెట్టి గెలిచినవారు చాలామంది ఉన్నారు.
ఇప్పుడు ఆ సొమ్ములు సంపాదించుకునేందుకు మార్గాలు కనిపించడం లేదు.

అసలు ఇవే కాదు గ్రామ స్థాయిలో చిన్న చిన్న సమస్యలను తీర్చేందుకు అవసరమైన నిధులను ఖర్చు పెట్టే పరిస్థితి లేకపోవడంతో, తమ సొంత సొమ్ములను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీనికి కారణం ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను వాడుకోవడమే.దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి.
వాటిని విడుదల చేయక పోగా , కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను ఏపీ ప్రభుత్వం వివిధ అవసరాల నిమిత్తం వాడుకోవడంతో, ఇప్పుడు వైసీపీ తరఫున గెలిచిన గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గెలిచిన వారిలో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వారు ఉండడంతో, ప్రభుత్వం తీరు విమర్శించ లేక మౌనంగానే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .తాము ఎన్నికల సమయంలో లక్షలకొద్దీ సొమ్ము ఖర్చు పెట్టినా, ఇప్పుడు వాటిని సంపాదించుకునే మార్గం లేకపోగా, గ్రామస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారట.