ఒకవైపు చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు వరుస వరుసగా సమీక్షలు చేస్తూ, ఎన్నికల సంఘం, చీఫ్ సెక్రటరీ తదితరుల మీద ఆరోపణలు చేస్తూ, మరో పక్క జాతీయ రాజకీయాల వైపు ఇంకో అడుగు వేస్తూ మొత్తానికి చేయాల్సిన హడావుడి అంతా చేసేస్తున్నాడు.ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ పరిస్థితి చూసుకుంటే ఆ హడావుడి ఎక్కడ కనిపించడంలేదు.
పూర్తిగా సైలెంట్ అయిపోయారు.పోలింగ్ తేదీ సాయంత్రం చిన్న ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించారు.
ఆ తరువాత గవర్నర్ ను కలిసి ఓ సరి మీడియాతో మాట్లాడారు.ఆ తరువాత ఇంకో అప్డేట్ కనిపించలేదు.
చంద్రబాబు చేస్తున్నట్టుగా ఎక్కడా సమీక్షలు కానీ, పార్టీ నాయకులతో సమావేశం అవ్వడం కానీ చేయకుండా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ఈ పరిణామాలు వైసీపీ శ్రేణులకు కూడా అంతుపట్టడంలేదు.
చంద్రబాబు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రతి రోజు ఏదో ఒక హడావుడి చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నాడు.ఈవీఎం ల పనితీరు మీద అనుమానం వ్యక్తం చేస్తూనే తామే అధికారంలోకి రాబోతున్నాము అంటూ పార్టీ నాయకుల్లో ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
కానీ బాబు చేస్తున్న అంత స్థాయిలో కాకపోయినా జగన్ కూడా చిన్నపాటి సమీక్షలు కూడా ఎందుకు చేయడంలేదో అన్న విషయమే రాజకీయ వర్గాలకు అంతు చిక్కడంలేదు
పోలింగ్ ముగిసిన తరువాత రెండు మూడు సార్లు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులను తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడిన జగన్ ఆ తరువాత హాలీడే కోసం సిమ్లా కి వెళ్లి వచ్చారు.ఆ తరువాత ఆయన పెళ్లిలకు హాజరవుతున్నారు.
అయితే, అసలు జగన్ సైలెన్స్ కు కారణమేంటనేది జగన్ కు అంత్యంత సన్నిహితులైన వ్యక్తులకు కూడా తెలియడంలేదు.పోలింగ్ సరళి వైసీపీకి అనుకూలంగా ఉందనే అంచనాలు వస్తున్నా జగన్ మాత్రం తమకు ధీమా ఇచ్చేలా ఎందకు మాట్లాడటం లేదో అన్న విషయం అర్ధం కాకా పార్టీ నాయకులు సతమతం అయిపోతున్నారు.