తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ముందుగానే ప్రణాళికలు రచించుకుంటోంది.రెండుసార్లు వరుసగా టిఆర్ఎస్ గెలవడంతో, సహజంగా ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతుందని ముందుగానే అంచనా వేసింది.
ఆ వ్యతిరేకతను తగ్గించుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ వ్యవస్థ ప్రశాంత్ కిషోర్ ను టిఆర్ఎస్ నమ్ముకుంది.ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం తో ఒప్పందం కూడా చేసుకుంది.
ఈ టీమ్ ఇప్పటికే రంగంలోకి దిగి పోయింది.క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనితీరు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ? ప్రతిపక్షాలు ఎంతవరకు బలంగా ఉన్నాయి ? ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎంత మంది తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ? వారి స్థానంలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు ? ఇలా అనేక అంశాలపై సమగ్రంగా సర్వే చేపట్టి నివేదికలను కేసీఆర్ కు అందించారు.
వాటి ఆధారంగా కేసీఆర్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉండడంతో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెంచుతోంది.అంతే కాదు రాబోయే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలనేది ప్రశాంత్ కిషోర్, ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీమ్ డిసైడ్ చేయబోతూ ఉండడం మరింతగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తోంది.
కెసిఆర్ సైతం రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత పూర్తిగా ప్రశాంత్ కిషోర్ కు అప్పగించారు.

దీంతో వారు చెప్పిన వారికి టిక్కెట్లు కేటాయించే పరిస్థితి ఉంది.దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో మూడు ఒంతుల మందికి రాబోయే ఎన్నికల్లో అవకాశం ఉండదని, కొత్త వారికి టిక్కెట్లు కేటాయిస్తారనే ప్రచారం తెరపైకి రావడం తో ప్రశాంత్ కిషోర్ పేరు చెప్తేనే ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది.రాబోయే ఎన్నికల్లో కేసిఆర్ దయ కంటే ప్రశాంత్ కిషోర్ నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపు జరగబోతూ ఉండడంతో నియోజకవర్గాల్లో తమ గ్రాఫ్ట్ పెంచుకునే పనిలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారట.