సామ బేద, దండోపాయాలు అన్నీ ఉపయోగించి హుజురాబాద్ ఎన్నికల్లో గట్టెక్కలి అనే విధంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలకు తెర తీస్తోంది.ఇక్కడ బిజెపి అభ్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఒకవైపు రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, మరోవైపు ఈ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఇప్పటికే దళిత బందు వంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఆ సామాజిక వర్గం ప్రజలు మద్దతు హుజూరాబాద్ నియోజకవర్గం లో పూర్తి స్థాయిలో మద్దతు ఉండేలా టిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
అదీకాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ ఇలా అంతా నియోజకవర్గాన్ని ఫోకస్ చేసుకున్నారు.కోట్లాది రూపాయల సొమ్ము ఖర్చు పెడుతున్నారు.
వివిధ పథకాల పేరుతో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు భారీస్థాయిలో సొమ్ము అందే విధంగా ప్లాన్ చేశారు.
అలాగే రోడ్లు మరమ్మతులు, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నారు.
ఇప్పటికే హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు కింద దళిత బంధు పథకాన్ని అమలు చేశారు.అలాగే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రారంభించారు.
దీంతో హుజురాబాద్ వ్యవహారం తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ విధంగా వేల కోట్లతో ఈ నియోజక వర్గానికి నిధులు ఇస్తున్నారని, మిగతా నియోజకవర్గాలను పట్టించుకోవడంలేదనే విషయం తెరపైకి వచ్చింది.
అదీ కాకుండా తమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రాజీనామా చేస్తే హుజురాబాద్ అభివృద్ధి సంక్షేమ పథకాలు పెద్ద పీట వేస్తారు అని, తన నియోజకవర్గం హుజూరాబాద్ మాదిరిగా మారుతుందని, తాము భారీగా లబ్ధి పొందుతున్నారు అనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

దీనికి కారణంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది.ఇదే విషయాన్ని టిఆర్ఎస్ మంత్రి , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకు వెళుతూ , తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని , దళిత బంధు తో సహా అన్ని పథకాలను తమ నియోజకవర్గాల్లో అమలు చేయాలని , అప్పుడే తాము ఆ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి ఉంటుంది అని , తమను ఆదుకోవాలంటూ కేటీఆర్ కు మొర పెట్టుకుంటూ ఉండటం తో, ఆయన ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.హుజురాబాద్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతోనే అక్కడ ఈ స్థాయిలో అభివృద్ధి చేపడుతున్నామని, రాష్ట్రమంతా ప్రస్తుతం ఈ తరహా లో అభివృద్ధి చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని , ప్రజలకు ఏదో రకంగా నచ్చ చెప్పుకోవడం మానేసి, ఈ విధంగా వ్యవహరించడం సరి కాదు అంటూ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం
.