కేటీఆర్,హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తుండ్రు:టిపిసిసి నేత బట్టు జగన్ యాదవ్

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టిపిసిసి నాయకుడు బట్టు జగన్ యాదవ్ అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రేవెల్లి గ్రామంలోని తన నివాసంలో ఆయన శనార్తితో మాట్లాడుతూ కేటీఆర్,హరీష్ రావు పదేళ్లు మంత్రులుగా ఉండి రైతులకు ఒక్క మేలు కూడా చేయని అసమర్ధులని,రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లో రూ.20,480 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.13,300 కోట్లు మాత్రమే చేశారని,నాడు రుణమాఫీనీ ఆలస్యం చేయడంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నాటి ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి జైల్లో చిత్రహింసలు చేసిన చరిత్రను రైతులు మర్చిపోలేదని,నాటి కర్మనే నేడు ప్రతిపక్షంలో కూర్చోపెట్టిందని,అయినా అధికారం మదం, అహంకారం తగ్గలేదని మండిపడ్డారు.అధికారంలోకి వచ్చాక అప్పుల బాధ్యత తీసుకుంటామని రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ 3 విడతలుగా చేయడంతో ఆనందపడుతున్న రైతులను చూసి ఓర్వలేక చిల్లర మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతుతున్నారని,చివరికి రైతులను ఏం చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదని,రైతు రుణమాఫీ చేయడం వీరికి ఇష్టం లేనట్లు ఉందన్నారు.ఇంకా రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదని,ఇప్పటి వరకు 22.37 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.17,933.19 కోట్లను జమ చేయడం ద్వార వారందరిని రుణ విముక్తులను చేశామని, ఆధార్ కార్డులో తప్పులు, రేషన్ కార్డు లేని వారు, ఇతర కారణాలతో రెండు లక్షల లోపు రుణమాఫీ జరగని రైతులు దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి తగిన రికార్డులు సమర్పిస్తే త్వరలో రుణమాఫీ వర్తిస్తుందని,రెండు లక్షల కంటే అధికంగా ఉన్న వారు సదరు అధిక మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తే వారికి రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.అంతేకానీ,రైతులను అయోమయానికి గురి చేసేలా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు.

Latest Nalgonda News