పర్యావరణ పరిరక్షణ లో భాగంగా తిరుమల లో టీటీడీ చేపట్టిన గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు వచ్చింది, తిరుపతి లోని పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ డైరెక్టర్ జనరల్ శ్రీ అభయ్ బాక్రే టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తో సమావేశమయ్యారు.తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న గ్యాస్ ఆధారిత ఆవిరికి బదులుగా సోలార్ ఆధారిత ఆవిరిని ఉపయోగించేందుకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి టీటీడీ అధికారులు వివరించారు.
అలాగే కాకుల కొండ వద్ద పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయాలు తెలియజేశారు.ప్రత్యామ్నాయ విద్యుత్ కు సంబంధించి తిరుమల ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి గల అన్ని అవకాశాలు పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపుతామన్నారు.టీటీడీ అధికారులు ఈ బృందంతో కలసి ప్రతిపాదనలు పంపితే ఇందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తామని వారు వివరించారు.
జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విద్యుత్ విభాగం డిఈ శ్రీ రవిశంకర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి శ్రీ అభయ్ బాక్రే ను శాలువతో సత్కరించి, స్వామివారి 12 షీట్ క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తులు అందించారు.