ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అది కూడా తన పదవీకాలం ముగిసే సమయం మార్చి లోపు ఈ తంతు మొత్తం ముగించాలని ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలతో ఉన్నారు.ఆ పట్టుదలతోనే ఏపీ ప్రభుత్వం పై కోర్టులో పోరాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇక వైసీపీ ప్రభుత్వం విషయానికి వస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తి అని, ఆయన పదవీ కాలం మార్చిలో ముగియనున్న నేపథ్యంలో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు వెళ్ళకూడదని, అలా వెళితే వైసిపి నష్టపోతుందనే అభిప్రాయంతో ఎన్నికలను ఆయన పదవీకాలం ముగిసే వరకు ఏదో ఒక రకంగా వాయిదా వేయించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఇప్పటికే ఈ వ్యవహారం పై కోర్టులో ఒకపక్క పిటిషన్ లు దాఖలు అవుతూనే వస్తున్నాయి.

నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలకమైన సమావేశాలు ఉన్నాయని, అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తున్నా, అధికారులు ఎవరు పెద్దగా పట్టించుకోనట్లు గానే వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే చీఫ్ సెక్రటరీ, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య లేఖల వార్ కూడా నడిచింది.ప్రస్తుతం అధికారులంతా కరోనా కు సంబంధించిన విధులలో ఉన్నారని, ఇప్పట్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎవరు సిద్ధంగా లేరని , మరికొంతకాలం ఇదే పరిస్థితి ఉంటుందని చీఫ్ సెక్రటరీ ఏపీ ఎన్నికల అధికారి కి లేఖ రాశారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది .జనవరి , ఫిబ్రవరి నెలలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని , ఇప్పటికే కేంద్రం , సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టులో ప్రస్తావించింది.
వ్యాక్సిన్ ప్రజలకు అందించే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని , ఆ వాక్సిన్ ను ప్రజలకు అందించే ఏర్పాట్ల లో అధికారులు బిజీగా ఉంటారని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పిందని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో, ఏపీ మీ ఎన్నికల అధికారి తరఫున వాదిస్తున్న న్యాయవాది ఈ విషయంపై ఏం సమాధానం చెప్పాలో తెలియక కౌంటర్ దాఖలుకు మరికొంత కాలం గడువు కోరారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ పై చర్చ జరుగుతోంది.వీలైనంత తొందరగా ఆ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే ఏర్పాట్లు పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా దృష్టి పెట్టాయి.
ఈ దశలో ఎన్నికల అంశం గురించి ఎవరూ ఆలోచించే పరిస్థితి లేదు.దీంతో వైసిపి ఊహించినట్లుగానే ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశమే కనిపించడం లేదు.దీంతో నిమ్మగడ్డ ఆశ తీరేలా కనిపించడం లేదు.ఈ వ్యవహారంపై కోర్టులో నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఏ కౌంటర్ దాఖలు చేస్తారో చూడాలి.