కరోనా కరాళ నృత్యంతో ప్రపంచదేశాలు తల్లడిల్లిపోతున్నాయి.ఇప్పటికే లక్షన్నర మంది ప్రజలు కరోనా కారణంగా మరణించగా, 21 లక్షల మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదే సమయంలో విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం పలు దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు సైతం ఈ మహమ్మారి కోరల్లో చిక్కారు.ఇప్పటికే పలువురు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజాగా తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుడు మక్కాలో ప్రాణాలు కోల్పోయారు.నిజామాబాద్‌కు చెందిన 65 ఏళ్ల అజ్మతుల్లా ఖాన్ 35 ఏళ్లుగా మక్కాలోని బిన్‌లాడెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో పనిచేస్తున్నారు.
ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.ఈ క్రమంలో అజ్మతుల్లా ఖాన్‌కు తీవ్రమైన జ్వరం రావడంతో మంగళవారం కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా గురువారం కన్నుమూశారు.
ఆ తర్వాత చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఫ్యామిలీ మెంబర్స్ షాక్‌కు గురయ్యారు.

అయితే ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అజ్మతుల్లాఖాన్ కుమారులు, కుమార్తెలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయం మక్కాలోని భారత కాన్సుల్ జనరల్ ఎండీ నూర్ రెహ్మాన్ దృష్టికి వెళ్లడంతో వీరి కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
కాగా గురువారం సౌదీ అరేబియాలో కొత్తగా 518 కేసులు నమోదైనట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది.కొత్త కేసుల్లో 195 జెడ్డాలో, మదీనాలో 91, రియాద్‌లో 84, మక్కాలో 58, దమ్మంలో 38 కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ 19 నుంచి 59 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.