వాళ్లు అరిచి గోల చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోడేంటి ?

తెలంగాణాలో తమకు ఎదురేలేదు అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా ఎవరూ నోరెత్తకుండా చేసుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు.

ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను బలహీనం చేయడంతో, తాము ఏం చేసినా, పెద్దగా ఎవరూ పట్టించుకోరనే అభిప్రాయంలో కెసిఆర్ ఉంటూ వస్తున్నారు.

అలాగే ఏ విషయంలోనూ, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా, కెసిఆర్ చేసుకోగలుగుతున్నారు.ఇదే ఫార్ములాను రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పాటిస్తూ వస్తున్నారు.

కానీ కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభించిన తర్వాత కెసిఆర్ పై వేలెత్తి చూపించే వారి సంఖ్య ఎక్కువైపోయింది.కేంద్రంతో పాటు, ప్రతిపక్షాలు, చివరకు సొంత పార్టీ నాయకులు సైతం కేసీఆర్ తీరును తప్పు పడుతున్నారు.

కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో కెసిఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారని, కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా, పట్టించుకోవడం లేదంటూ విమర్శలు మొదలుపెట్టారు.ఇక పూర్తిగా నిరుత్సాహంలో కూరుకుపోయిన కాంగ్రెస్ సైతం ఇప్పుడు కరోనా అంశాన్ని హైలెట్ చేసి, కేసీఆర్ ను ఇరుకున పెట్టి, తాము పైచేయి సాధించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Advertisement

దీనిలో భాగంగా కొద్ది రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ ఉన్న ఆస్పత్రులను సందర్శిస్తూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ముఖ్యంగా మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటివారు ఆసుపత్రులను సందర్శిస్తూ, అక్కడ లోపాలను ఎత్తి చూపుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అసలు తెలంగాణలో కరోనా విజృంభించడానికి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని, తెలంగాణలో కరోనా నివారణ కు 10 వేల కోట్లు ఖర్చు చేస్తాం అంటూ చెప్పి, కనీసం 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేక పోయారని, ఈ వైరస్ సోకిన వారిని కనీసం ఆసుపత్రుల్లో చేర్చుకునే అవకాశం లేక హోమ్ ఐసోలేషన్ లో ఉండి పోవాల్సి వస్తోందని, ఇలా ఎన్నో విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నా, టిఆర్ఎస్ పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను సైతం టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్, కరోనా వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

టిఆర్ఎస్ ఈ విషయంలో నోరు మెదపకపోవడానికి కారణం కరోనా కట్టడిలో నిజంగానే చురుగ్గా వ్యవహరించలేకపోవడమే అనే అభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తోంది.ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలను విమర్శించినా తిరిగి అది తమ మెడకే చుట్టుకుంటుందనే అనుమానం తలెత్తడంతోనే కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నా, కేసీఆర్ అండ్ కో సైలెంట్ గానే ఉండిపోతున్నారనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

కార్యకర్తలకు వందనం .. జగన్ ను నమ్ముతారా ? 
Advertisement

తాజా వార్తలు