జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది.ఇప్పటికే ఈ హత్య వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టింది.
కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.ముఖ్యంగా ఈ వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే , ఈ వ్యవహారంపై వివేక కుమార్తె సునీత సి బీ ఐ కి ఇచ్చిన స్టేట్మెంట్ లో అనేక సంచలన విషయాలు బయట పెట్టారు.మా నాన్న ను ఎవరు చంపారో పులివెందులలో చాలామందికి తెలుసు.
హంతకులు ఎవరో తేల్చాలని అన్న (జగన్ ) ను కోరా.
అనుమానితుల పేర్లు చెప్పా.
వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్.నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారు.
అయితే దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్ చేశా.సిబిఐ కి ఇస్తే ఏమవుతుంది ? అవినాష్ రెడ్డి బిజెపి లో చేరుతాడు.అతడికేమీ కాదు.11 కేసులకు మరొకటి తోడై 12 కేసులు అవుతాయి అని జగన్ మాట్లాడడం నన్ను బాధించింది.అంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత పేర్కొన్నారు.అలాగే అనుమానితుల జాబితాలో ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్ కుమార్ రెడ్డి పేరు చేర్చడం పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని సునీత చెప్పారు.
సొంత చిన్నాన్న ప్రాణం కన్నా ఎవరో కాంపౌండర్ ఎక్కువ అయ్యారని, తన తండ్రి మరణవార్తతో సంబరాలు చేసుకోవడానికి బాణసంచా కొనుగోలుకు యత్నించిన వ్యక్తిని ఎలా వదిలి పెట్టారో అర్థం కావడం లేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు న్యాయం లభించదనే ఉద్దేశంతోనే సిబిఐ విచారణకు హైకోర్టు ను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.రాజకీయంగా తన తండ్రి వివేకా పై కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కక్ష పెంచుకున్నారు అని ఆమె చెప్పారు.హత్య జరిగిన రోజు కూడా నాన్న మరణించారని మొదట భారతికి , తర్వాత జగన్ కు ఫోన్ చేసి చెబితే.అవునా అంటూ చాలా తేలిగ్గా మాట్లాడారని , ఆశ్చర్యం, బాధ వంటివి కొంచెం కూడా కనిపించడం లేదని ఆమె వాపోయారు.2020 జూలై 7 న సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఆమె మరెన్నో అనుమానాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.