గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఒకటే హడావుడి మీడియాలో నడుస్తూ వస్తోంది.జగన్ తీరుపై ఆగ్రహంతో షర్మిల ఉన్నారని, తెలంగాణలో ఆమె పార్టీ స్థాపించి, తన సత్తా చాటుతారు అని ఓ వర్గం మీడియా లో రావడం పెద్ద సంచలనమే రేపింది.
షర్మిల పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరి తొమ్మిదో తేదీన పేరును ప్రకటించబోతున్నట్లు గట్టిగానే మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే ఈ వ్యవహారాలపై షర్మిల స్పందించారు.
ఈ మేరకు ఒక లేఖను కూడా విడుదల చేశారు.తనపై వస్తుంది అంతా దుష్ప్రచారం అని ఆమె లేఖలో క్లారిటీ ఇచ్చారు.
కానీ ఆమె పార్టీ స్థాపించే వ్యవహారంపై ఇంకా కథనాలు వెలువడుతూనే ఉన్నాయి.అయితే అసలు షర్మిల ఆ లేఖ విడుదల చేసిందా లేక ఆమె తరుపున ఎవరైనా ఈ లేఖ విడుదల చేశారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.
పార్టీ ఏర్పాటు గురించి ఆమె నేరుగా మీడియాలో కానీ, వీడియో రూపంలో కానీ మాట్లాడకుండా, కేవలం లేఖ మాత్రమే రాసి సైలెంట్ అవడంతో నిజంగానే ఆ లేఖ రాశారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా ముద్ర పడిన తెలంగాణ నేత గోనె ప్రకాశరావు ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పార్టీ ఏర్పాటు విషయమై స్పందించారు.
షర్మిలకు మొదటి నుంచి రాజకీయపరమైన ఆశయాలు ఉన్నాయని, జగన్ కంటే షర్మిల దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.జగన్ పాదయాత్ర ఉదయం 11 గంటలకు మొదలుపెట్టి, సాయంత్రం 5:30 కి ముగించేసి హైదరాబాద్ వెళ్ళిపోయేవారు అని, కానీ షర్మిల మాత్రం రోజంతా యాత్ర చేసేదని ప్రకాష్ రావు గుర్తుచేస్తున్నారు.జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల చేసిన పాదయాత్ర కారణంగానే అప్పటి ఉప ఎన్నికలలో వైసిపి గెలిచింది అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

అంతే కాదు జగన్ తో సమానంగా షర్మిల అంటే రాజశేఖరరెడ్డి కి అభిమానం ఉందని, అందుకే ఆస్థి కూడా సమానంగా పంచారని ప్రకాష్ గుర్తుచేశారు.ఈ సందర్భంగా షర్మిల సొంత పార్టీ కోసం ఎప్పుడో ప్రయత్నాలు ప్రారంభించిందని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది అంటూ ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే వైఎస్ కుటుంబంపై తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి సానుకూల అభిప్రాయం ఉండటం, తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం కావడంతో ఇప్పుడు తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీ పై ఆ సామాజిక వర్గం నేతల్లోనూ ఆసక్తి నెలకొంది.
బిజెపికి ప్రత్యామ్నాయంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఒక వ్యూహం ప్రకారం షర్మిల ద్వారా తెలంగాణలో పార్టీ పెట్టిస్తున్నారు అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.ఏది ఏమైనా ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నాటికి కానీ షర్మిల పార్టీ పెడుతున్నారా లేదా అనే విషయమై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ లోపు షర్మిల పార్టీ , రాజకీయంపై రకరకాల స్పందనలు చూడక తప్పదు.