బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రిని అపర చాణక్యుడిగా అభివర్ణిస్తారు.కానీ అలాంటి చాణక్యుడికి కూడా మహారాష్ట్ర రూపంలో పెద్ద షాక్ తగిలింది.
శరద్ పవార్ పవర్ ప్లే ముందు షా ఎత్తులు నిలవలేకపోయాయి.తెల్లారముందే ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ సాయంతో అధికారంలోకి వద్దామనుకున్న బీజేపీకి సుప్రీంకోర్టు తీర్పు షాకిచ్చింది.
అజిత్ పవార్ రాజీనామాతో తప్పనిసరి పరిస్థితుల్లో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తప్పుకోవాల్సి వచ్చింది.
దీంతో మహారాష్ట్రలాంటి అత్యంత సంపన్నమైన రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది.అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద ముంపు ఆ పార్టీకి, అపర చాణక్యుడు అమిత్ షాకు పొంచి ఉన్నట్లు శరద్ పవార్ తాజా ఇంటర్వ్యూతో తేలిపోయింది.సాక్షాత్తూ ప్రధాని మోదీయే రంగంలోకి తన కూతురికి కేంద్ర మంత్రి పదవి ఇస్తానని ప్రలోభ పెట్టారని పవార్ వెల్లడించడం గమనార్హం.
పైగా పార్లమెంట్ సాక్షిగా పవార్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు.అయినా ఆయన లొంగలేదు.ఇక ఇప్పుడు కాంగ్రెస్, శివసేనతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.మహారాష్ట్రలో రాజ్యమేలుతున్న అంబానీలాంటి గుజరాతీలకు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముంబైతోపాటు మహారాష్ట్రలో గుజరాతీల ప్రాబల్యం భారీగా పెరిగిపోతోంది.ఈ మధ్య చిన్న, పెద్ద కాంట్రాక్టులన్నీ వాళ్ల చేతికే చిక్కాయి.
అయితే అప్పటి కాంట్రాక్టులన్నింటినీ మళ్లీ సమీక్షిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడం గమనార్హం.అంతేకాదు మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపైనా సమీక్ష జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.మరాఠాల హక్కుల కోసం పోరాడే శివసేన.ఎప్పటి నుంచో గుజరాతీల హవాను అంగీకరించలేకపోతోంది.
ఇప్పుడు వాళ్ల చేతిలోనే అధికారం ఉండటంతో మరాఠా అస్తిత్వాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకుంది.అంతేకాదు ఫడ్నవీస్ హయాంలో జరిగిన అక్రమ లావాదేవీలను కూడా వెలికి తీయడానికి సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే.అమిత్ షాపై ఉన్న ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జి లోయా అనుమానాస్పద మృతిపై పునర్ విచారణ జరపాల్సిన అవసరం ఉందని సాక్షాత్తూ శరద్ పవారే చెప్పడం గమనార్హం.
అదే జరిగితే బీజేపీ అధ్యక్షుడికి సెగ మొదలైనట్లే.