ఏదో విధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు జనాలు పట్టం కడతారని అధికారంలోకి రాబోయేది తామేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు.ప్రస్తుతం సొంత పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, సమన్వయ లోపం వంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నా, కాంగ్రెస్ పై ప్రజల్లో మాత్రం గతంతో పోలిస్తే ఆదరణ బాగా పెరిగిందని, అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యతిరేకత గతంతో పోలిస్తే బాగా పెరిగిందని రేవంత్ బలంగా నమ్ముతున్నారు.
అంతే కాదు తెలంగాణలో బిజెపి బలపడుతున్నట్టు కనిపిస్తున్నా , అది కేవలం కొన్ని జిల్లాలకు , కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, ఆ ప్రభావం తెలంగాణాలో కనిపించడం , భారీగా పెరిగిన ధరలు, పెట్రోల్ , డీజిల్ పెరుగుదల వంటి వ్యవహారాలు తెలంగాణ బీజేపీకి ఇబ్బందికరంగా మారుతాయి అని, రెండుసార్లు టిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది కాబట్టి , కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తుందని రేవంత్ అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, అలాగే బిజెపి బాగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఈ లెక్కన బిజెపి టిఆర్ఎస్ కు కాకుండా కాంగ్రెస్ కు మాత్రమే ఎక్కువ సీట్లు వచ్చి తెలంగాణలో అధికారం చేపడుతుందని రేవంత్ నమ్మకం పెట్టుకున్నారు.
ఆ నమ్మకంతోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తనకు తగిన విధంగా సహకరించకపోయినా, పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు రేవంత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ బలంగానే ఉందని బలమైన కేడర్ కాంగ్రెస్ కు ఉందని, ఎన్నికల సమయానికి జాగ్రత్తగా పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపగలిగితే అధికారంలోకి సునాయాసంగా వస్తామని రేవంత్ నమ్మకం తో ఉన్నారు.
అందుకే బిజెపి అంశాన్ని పెద్దగా ప్రస్తావించకుండానే పూర్తిగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ ఆయన విమర్శలు చేస్తున్నారు.అలాగే పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు ప్రోత్సహించడం, డిజిటల్ సభ్యత్వలు నమోదు చేయించడం వంటి వ్యవహారాల పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో బలమైన వ్యక్తులను కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగంలోకి దించేందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు.