హుజురాబాద్ ఎన్నికల సందడి ఎప్పుడో ముగిసిపోయింది.ఇక్కడ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ గెలవడం, ప్రమాణం స్వీకారం చేయడం వంటి వ్యవహారాలన్నీ జరిగిపోయాయి.
ఇక టిఆర్ఎస్ సైతం హుజురాబాద్ సంగతిని పక్కన పెట్టేసింది.అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన కాంగ్రెస్ లో మాత్రం హుజురాబాద్ ఎన్నికల కు సంబంధించిన ఫలితం పైన ఇంకా తర్జనభర్జన పడుతోంది.
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం దారుణంగా పడిపోవడం పై ఇప్పటికే నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఆదేశాలు జారీ చేశారు.అంతే కాదు ఈ నెల 13వ తేదీన టి పిసిసి నుంచి అనేక మంది నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.
గత కొద్ది రోజులుగా చూసుకుంటే హుజురాబాద్ ఎన్నికల ఫలితాల విషయంలో కాంగ్రెస్ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటూ పార్టీ సీనియర్లు కొంతమంది పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ విమర్శలు చేస్తున్నారు.
దీనికి కౌంటర్ గా రేవంత్ వర్గం అంతేస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగింది .తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్ తో పాటు , మరికొంతమంది నేతలు ఏఐసీసీ కార్యదర్శులు , సభ్యులు ఢిల్లీకి ఈనెల 13న రావాల్సిందిగా, అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.

అదే రోజు ఉదయం 10 గంటలకు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి చెందడానికి గల కారణాలపై అధిష్టానం పెద్దలు సమీక్ష జరపనున్నారు.ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్లు హుజురాబాద్ లో కాంగ్రెస్ ఓడిపోవడం పై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను గెలిపించేందుకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని ఫిర్యాదులు చేశారు.ఇప్పటికే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది.
దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నియోజకవర్గం ఓటమి పై సమీక్ష నిర్వ హించాలని , అసలు ఎందుకు ఇంత తక్కువ ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి అనే దానిపైన సమావేశంలో చర్చించాలని నిర్ణయించుకున్నారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో బాగా బలం పుంజుకుందని అధిష్టానం పెద్దలు నమ్ముతూ వచ్చారు .కానీ హుజురాబాద్ ఎన్నికల ఫలితం దారుణంగా ఉండడం అధిష్టానం పెద్దలకు మింగుడు పడడం లేదు.