బిజెపి నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికలు కాస్త టెన్షన్ పుట్టిస్తున్నాయి.మొన్నటి వరకు గెలుపు పై ధీమా ఉన్నట్టుగా రాజేంద్ర కనిపించినా, ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.
తనను ఓడించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశ పెట్టడంతో, ఆ సామాజిక వర్గం ఓట్లు భారీగా చీల్చే ప్రమాదం ఉందని రాజేందర్ కాస్త టెన్షన్ పడుతున్నారు.అయినా ఈ నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు, సెంటిమెంట్ ఇవన్నీ తనకు కలిసి వస్తాయని ఆయన నమ్ముతున్నారు.
అయితే మిగతా రాజకీయ ప్రత్యర్థుల వ్యవహారం ఎలా ఉన్నా, సొంత పార్టీ నేతలను చూసే రాజేందర్ భయపడే పరిస్థితి కనిపిస్తోంది.బిజెపి పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని, ధరలు ,పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఇలా అన్ని విషయాలలోనూ బిజెపి ప్రజల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం జనాల్లో కలగడం, చాలా కాలంగా బీజేపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ బాగా తగ్గిపోవడం, ఇవన్నీ హుజురాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయనే టెన్షన్ రాజేందర్ కు ఉంది.
అందుకే ఎన్నికల ప్రచారంలోనూ పెద్దగా బిజెపి ప్రస్తావన తీసుకు రాకుండా, తన సొంత ఇమేజ్ పైన ఆధార్ పడినట్లుగా రాజేందర్ వ్యవహరిస్తున్నారు.అంతే కాకుండా, బిజెపి అగ్రనేతలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వస్తే, అది తనకు కలిసి రాకపోగా, పెద్ద ముప్పు తీసుకువస్తుందనే టెన్షన్ కూడా రాజేందర్ లో ఎక్కువగా కనిపిస్తోంది.
అందుకే ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు ఎవరు ప్రచారానికి రాకుండా అన్ని తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.రాబోయే రోజుల్లో నూ బీజేపీ అగ్ర నేతలు ఎవరు ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి రానవసరం లేదని, రాజేందర్ సంకేతాలు ఇస్తున్నారు.