ఇందిరమ్మ గృహ కమిటీల్లో రాజకీయ జోక్యం తగదు:గంట సోమన్న

ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చాక తమ రాజకీయ ప్రయోజనాల కోసమే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది.

తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అది చేశాం,ఇది చేశాం అని చెప్పుకుని ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓట్లు అడగడం కోసమేఈ సంక్షేమ పథకాల అమలు( Welfare schemes ),ఉచితాల ఉద్దెర హామీలు అనేది అందరికీ తెలిసిందే.

ఈ రాజకీయ వ్యాపారం నాటి నుండి నేటి వరకు పార్టీతో, ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిరాటంకంగా కొనసాగుతుంది.ప్రజలు కూడా అలాంటి వాటికే జై కొడుతూ వెనుకా ముందు ఆలోచించకుండా ఓట్లు గుద్దేస్తూ వారిని నచ్చిన వారిని కాదు కాదు ఎక్కువ హామీలు ఇచ్చిన వారిని గద్దెనెక్కిస్తున్నారు.

ఇదంతా దేశంలో,అన్ని రాష్ట్రాల్లో షరామామూలే.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానంలో భాగంగా అర్హులైన వారికి ఇందిరమ్మ గృహాలను నిర్మించనున్నట్లు ప్రకటించింది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గతంలో మాదిరిగా కాకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉండేందుకు ప్రతీ గ్రామ,పట్టణ స్థాయిలో ఇందిరమ్మ గృహకమిటీలు ఏర్పాటు చేయాలని జీవో నెంబర్ 7 ను విడుదల చేసింది.ఈ జీవో ప్రకారం మున్సిపాలిటీ,గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ గృహ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ కమిటీల ( Indiramma Committees )ఎంపిక ప్రక్రియపై విస్తృతమైన చర్చ జరుగుతుంది.గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్/ప్రత్యేక అధికారి కమిటీ చైర్మన్ గా కమిటీ సభ్యులుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుండి ఇద్దరు మహిళలు,గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ముగ్గురు స్థానిక వ్యక్తులు(బీసీ నుండి ఒకరు,ఎస్సీ నుండి ఒకరు,ఎస్టీ నుండి ఒకరు)సభ్యులుగా ఉండేలా చూడాలని,ఈ కమిటీకి కన్వీనర్ గా పంచాయతీ కార్యదర్శి ఉంటారని ప్రకటించింది.

అలాగే పట్టణాల్లో మున్సిపాలిటీ స్థాయిలో వార్డు కౌన్సిలర్/కార్పొరేటర్ చైర్మన్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుండి ఇద్దరు మహిళలు, బీసీ,ఎస్సీ,ఎస్టీ నుండి ఒక్కొక్కరు సభ్యులుగా వార్డు అధికారి కన్వీనర్ గా ఉండేలా ప్రపోజల్స్ ను మండల/మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్ కు పంపితే ఆయన ధృవీకరించాక కమిటీలు పని ప్రారంభించాలని నిర్ణయించారు.ఇందిరమ్మ గృహ కమిటీల నియామకం విషయం సర్కార్ ప్రకటించగానే పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఉలిక్కిపడి నిద్ర లేచారు.

ప్రస్తుతం గ్రామ పంచాయితీలో సర్పంచ్ లు లేరు.ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది.

వారు గ్రామాల్లోకి వచ్చేది లేదు.ఏం జరుగుతుందో చూసేది లేదు.

పెంపుడు కుక్కలకు భానుమతి, రామకృష్ణ అని పేర్లు పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్..?
పుట్టినరోజు వేడుకల్లో డీజే కేసు నమోదు చేసిన పోలీసులు

అంతా గ్రామ కార్యదర్శులు చూస్తున్నారు.ఇప్పుడు ఇందిరమ్మ గృహ కమిటీల ఎంపిక ప్రక్రియ ఎవరు చేపట్టాలి? గ్రామకార్యదర్శి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుండి,సామాజిక స్పృహ కలిగిన ఎస్సీ,ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుండి ముగ్గురిని ఎంపిక చేస్తారా? లేక తనకున్న ఇష్టమైన వారి పేర్లు రాసి మండల అధికారులకు పంపిస్తారా? లేక స్థానిక రాజకీయ పార్టీ లీడర్ చెప్పిన వారిని ఎంపిక చేస్తారా అనేది ఎవరికీ అర్థంకాని ప్రశ్నగా మిగిలింది.ఇప్పటికే కొన్ని గ్రామాల్లో,పట్టణాల్లో ఈ కమిటీలు ఫైనల్ అయినట్లు కూడా తెలుస్తోంది.

Advertisement

ఆ కమిటీల్లో ఉన్నవారు ఎవరూ? వారిని ఎవరు ఎంపిక చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్షన్.ఇదిలా ఉంటే ఈ ప్రకటన వచ్చిందే ఆలస్యం చోటా మోటా లీడర్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.

ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఈ కమిటిల్లో తమ పార్టీకి చెందిన వారిని,అందులో కూడా స్థానిక నాయకులకు అనుచరులుగా ఉండే వారిని ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.ఇందిరమ్మ గృహ కమిటీల్లో తమ వారు ఉండడం వల్ల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తనదైన ముద్ర ఉండేలా చూసుకోవాలని తహతహలాడుతున్నారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా అధికార వర్గాల్లో తమకున్న సంబంధాలతో తమ వారికి అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.దీనితో ఇందిరమ్మ గృహ కమిటీల్లో రాజకీయ జోక్యం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉండేవారు ఈ కమిటీల్లో ఉంటే అర్హత కలిగిన లబ్దిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.వారంతా రాజకీయ ప్రయోజనాల కోసం తమ పార్టీ శ్రేణులను,అనర్హులను అర్హుల జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తారు, తద్వారా ప్రభుత్వం అనుకున్న పారదర్శకత కనుమరుగయ్యే ప్రమాదంకనిపిస్తుంది.

నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కాలంటే ఈ కమిటీల్లో ఏ రాజకీయ నేపథ్యం లేని,పట్టణ,గ్రామీణ అభివృద్ధిని కాంక్షించే సామాజిక స్పృహ కలిగిన వారిని ఎంపిక చేసేలా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి.ఏ రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చినా గతంలో ఇందిరమ్మ ఇళ్లు,డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో జరిగిన పరిస్థితే పునరావృతం అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఇప్పుడు జరిగే తంతును వేడుక చూస్తూ అంతా అయ్యాక విమర్శల పాలు అయ్యేకంటే ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనం సమకూరుతుంది.అర్హులైన ప్రజలకు కూడా మేలు జరుగుతుంది.

లేదంటే అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ ఉండదు.అదే జరిగితే అంతా రాజ్యం చేసే రాజకీయ కయ్యమే తప్పా ఇంకోటి ఉండదు.

Latest Nalgonda News