నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో ఒకటి హెయిర్ ఫాల్. స్త్రీలే కాదు, పురుషులు కూడా హెయిర్ లాస్ వల్ల సతమతమవుతున్నారు.
రోజూ రాలిపోయే వెంట్రుకలను చూసి ఉన్న వాటిని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నారు.అందులో భాగంగానే అనేక పద్ధతులను వారు ట్రై చేస్తున్నారు.
వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది.అయితే దీనికి ఎక్కువగా జన్యువులు (genes), వంశపారంపర్యత వల్ల కూడా కారణమవుతున్నాయి.
జుట్టు రాలడం అనేది పలచబడడం దగ్గర నుంచి బట్టతల రావడం వరకూ ఉండవచ్చు.తలపై వెంట్రుకలు లేని వారంతా బట్టతల సమస్య ఉన్నవారు కాదు.సహజంగా బట్టతల రావడం జన్యు సంబంధమైన విషయం.పైగా అది ద్వితీయ లైంగిక లక్షణాలకు సంబంధించిన జీవ భౌతిక ధర్మం.
మానవ పరిణామ క్రమంలో మునుపటి జీవుల్లో ఉపయుక్తమైనవి అవసరం లేనట్లయితే ఆయా శారీరక అవయవాలు లేదా లక్షణాలు తరువాతి జీవుల్లో అంతరించడం సర్వసాధారణం.శరీరంపై వెంట్రుకలు వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో వచ్చే తేడాల్ని తట్టుకోవడానికి సహకరిస్తాయి.
అందుకే గొర్రెలు, కోతులు, చింపాంజీలకు ఒళ్లంతా జుట్టు ఉంటుంది.ఆది మానవుడి దశ నుంచి ఆధునిక మానవుడిగా మారే క్రమంలో నివాసం, దుస్తులు వంటి బాహ్య రక్షక వ్యవస్థలను వాడుకోవడం మొదలయ్యాక మానవ పరిణామంలో జుట్టు అవసరం క్రమేపీ తగ్గింది.
కానీ శరీరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలైన తల, వక్షస్థలం, బాహుమూలలు, జననేంద్రియాలు వంటి ప్రదేశాల్లో జుట్టు తగ్గడం పరిణామక్రమంలో వెనకబడి ఉంది.
పురుషులలో బట్టతల వస్తుంది కానీ స్త్రీలలో ఎక్కువగా రాదు ఎందుకు అంటే.? జుట్టు ఊడటం లో లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది.పురుషులలో యాండ్రోజన్ హార్మోను ఎక్కువగా ఉండడం వల్ల వయసును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి.హార్మోన్ల మోతాదులో తేడాల వల్లనే స్త్రీలకు బట్టతల సాధారణంగా ఏర్పడదు.
కొన్ని తరాల తర్వాత ఆయా ప్రదేశాల్లో కూడా జుత్తు తగ్గుతుందని ఆంత్రపాలజిస్టులు సూచిస్తున్నారు.కాబట్టి బట్టతల రావడం పరిణామక్రమంలో సహజ పద్ధతే కానీ దాని పట్ల కలత చెందాల్సిన అవసరం లేదు.ద్వితీయ లైంగిక లక్షణాల ప్రభావం కావడం వల్ల, స్త్రీ సంబంధ హార్మోన్ల ప్రభావం వల్ల ఆడవారి జుట్టు పొడవుగా, దట్టంగా ఉంటుంది.వారికి బట్టతల వచ్చేలా హార్మోన్లు సహకరించవు.