ప్రభుత్వ ఆసుపత్రికి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని 2018 సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్ అన్నారు.

గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ఆసుపత్రిని సందర్శించి సమస్యలపై సర్వే నిర్వహించి,ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు వైద్య సేవల కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని,ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో జాతీయ రహదారులు ఇతర మండలాలు దగ్గరగా ఉండడం వలన ఈ ఆసుపత్రికి ప్రమాద బాధితులు,ఇతర రోగులు అధిక సంఖ్యలో వస్తున్నప్పటికీ రోగులకు తగు రీతిలో వైద్య సేవ అందించలేకపోతున్నారని అన్నారు.ఈరోజు సర్వేలో పరిశీలన చేయగా అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయని,అందులో ప్రధానంగా ఈ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కొరత ఉందని, ఫిరియాట్రిషన్ డాక్టరు రేడియాలజిస్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, జనరల్ మెడిసిన్ డాక్టర్లు లేకపోవడం, ఉన్నవారు కూడా డిప్యూటేషన్ పై వేరే ప్రాంతానికి పోవడం వలన ఇక్కడ వైద్య సేవలు నామమాత్రంగా మిగిలిపోయాయన్నారు.

లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ ప్రభుత్వాసుపత్రిలోనే ఐసీయూ నిర్మాణం చేపట్టారని,కానీ, పూర్తిస్థాయి అనిస్తిషియా డాక్టరు,జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లేకపోవడం వలన ఐసియు సేవలు ప్రారంభం కాలేకపోతున్నాయన్నారు.అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆసుపత్రికి వస్తున్న రోగులకు స్కానింగ్ చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ పూర్తిస్థాయి రేడియాలజిస్ట్ లేకపోవడం వలన గర్భిణులకు తప్పించి మిగతా రోగులకు స్కానింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

గతంలో శానిటేషన్ కు సంబంధించి 30 పడకల ఆసుపత్రి కొరకు టెండర్ పిలిచినప్పటికీ ప్రస్తుతం ఆ టెండర్ ను 15 పడకల ఆసుపత్రికి తగ్గించి టెండర్ పిలవడం వలన గతంలో 12 మంది ఉన్న శానిటేషన్ సిబ్బంది ప్రస్తుతం ఏడుగురు ద్వారా విధులు నిర్వహించవలసిన పరిస్థితి వస్తుందన్నారు.దీనివల్ల ఆసుపత్రి వార్డులలో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యం లోపించుతుందని,ఈ పని చేస్తున్న కార్మికులకు కూడా సదరు కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారని, అదేవిధంగా కొంతమందికి తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.

Advertisement

ఆలేరు ప్రభుత్వాసుపత్రిలో దయనీయమైన ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎప్పుడు కూడా దీనిపై దృష్టి పెట్టలేదని, అంతేకాకుండా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరిగిందని,దీని వల్ల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు.ఆలేరు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ ఇక్కడ 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని చెప్పి మంజూరు చేయకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.

ఇప్పటికైనా స్పందించి ఆలేరులో ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించి, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దూపటీ వెంకటేష్, సిఐటియు జిల్లా నాయకులు మోరిగాడి రమేష్,రైతు సంఘం మండల కార్యదర్శి సూదగాని సత్య,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News