అస్తవ్యస్తంగా ఉన్న పార్టీ పరిస్థితిని ఒక గాడిలో పెట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ ఇమేజ్ ఆధారంగా జనసేన ను అధికారం వైపు తీసుకురావాలని పవన్ భావిస్తూ వచ్చారు.
అలాగే ఆ పార్టీ బలం తో పాటు, తనకు ఉన్న సినీ గ్లామర్ కూడా కలిసి వస్తుందని పవన్ నమ్మారు.అయితే సినీ గ్లామర్ కేవలం కొంత వరకు మాత్రమే పని చేస్తుందని, రాజకీయాల్లో రాణించాలంటే సినీ బలంతో పాటు, రాజకీయంగా క్షేత్రస్థాయిలో బలపడడం ఒక్కటే మార్గం గా పవన్ అభిప్రాయపడుతున్నారు.
దీనిలో భాగంగానే తమ పార్టీకి ఒక రాజకీయ వ్యూహకర్త ను నియమించుకుని, పార్టీని అధికారం వైపు నడిపించాలని పవన్ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నా, జనసేన కు రాజకీయ బలం పెద్దగా పెరగకపోవడం పవన్ కు ఇబ్బందికరంగా మారింది.
పూర్తిస్థాయిలో రాజకీయాల పైన దృష్టి పెట్టి సినిమాలకు దూరం అవుదామని పవన్ అనుకుంటున్నా , జనసేన ను ముందుకు నడిపించేందుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాల్లో నటించాల్సి వస్తోంది.దీంతో పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోవడం వంటివి జనసేన కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తున్నాయి.
ఈ విషయాన్ని గుర్తించిన పవన్ ఇప్పుడు వ్యూహకర్తను నియమించుకుని పార్టీని అధికారం వైపు నడిపించాలి అనే ఆలోచనలో పవన్ ఉన్నారట.అందుకే వ్యూహకర్త కోసం పవన్ వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అసలు ఏపీలో జనసేన కు బలమైన నియోజకవర్గాలు ఏమిటి ? రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో పార్టీకి విజయం దక్కుతుంది ? తమ మిత్రపక్షమైన బీజేపీ సహకారం ఎంతవరకు ఉంది ? అలాగే బిజెపికి బలమైన నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ? ఇలా అనేక అంశాలతో సర్వే చేస్తున్నట్లు సమాచారం.

ఈ సర్వే నిమిత్తం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తో పవన్ ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ సర్వే ద్వారానే జనసేన కు సంబంధించిన సమగ్ర విషయాలను పవన్ తెలుసుకుని, ఆ సర్వే రిపోర్టు ఆధారంగా రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు పవన్ సిద్ధమవుతున్నారట.2019 ఎన్నికల్లో జనసేన కు ఎంత పరాభవాన్ని మిగిల్చాయో పవన్ ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు.ఆ ఫలితాలు 2024 ఎన్నికల్లో రిపీట్ కాకుండా చూసుకునేందుకు ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు.