బీకామ్ లో ఫిజిక్స్ ... జలీల్ ఖాన్ కొంప ముంచిందా ..?       2018-05-19   07:31:47  IST  Bhanu C

బీకాంలో ఫిజిక్స్ … అని చెప్పి దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌‌. ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నేను బీకామ్ లో ఫిజిక్స్ చేసాను అని చెప్పి అభాసుపాలు అయ్యారు. అంతేనా ..? సదరు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి సర్ బీకామ్ లో ఫిజిక్స్ ఉండదు కదా సర్ అంటే.. ఎందుకు ఉండదు ఉంటది ఉంటది అంటూ చెప్పి దేశవ్యాప్తంగా కమెడియన్ అయ్యాడు. ఆ ఎఫెక్ట్ అక్కడితో ఆగిపోతే పర్లేదు. ఇప్పుడు అది అతని ఎమ్యెల్యే సీటుకే ఎసరు పెట్టేసింది అంటే నమ్ముతారా ..? అయితే చదవండి.

జలీల్‌ఖాన్‌ను మరోసారి బరిలోకి దింపితే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో టీడీపీ నాయకత్వం ఉంది. ఆయన్ను ఇప్పుడంతా ఎమ్మెల్యేగా కంటే ఒక హస్యకోణంలోనే ఎక్కువగా ఆదరిస్తున్నారు . జలీల్‌ ఖాన్‌ తీరుతో ఓటేసిన నియోజకవర్గ ప్రజలు కూడా లోలోన బాధపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జలీల్‌ ఖాన్‌కు టీడీపీ నాయకత్వం టికెట్‌ ఇచ్చేందుకు ఇష్టపడడంలేదని తెలుస్తోంది.

విజయవాడ పశ్చిమ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్వె పార్టీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జలీల్‌ఖాన్‌ను బరిలోకి దింపితే ఆయనతో పాటు పార్టీ పరువు గంగలో కలవడం ఖాయం అని టీడీపీ ఒక అభిప్రాయానికి వచ్చేసింది. వైసీపీ నుంచి తాను ఫిరాయించి వస్తే ఇప్పుడు ఏకంగా టికెట్‌ ఇవ్వడం కుదరదు అంటే ఎలా అని జాలీలాఖాన్ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.

దీనికి మరో ప్రత్యామ్న్యాయంగా అమెరికాలో ఉంటున్న తన కుమార్తెకైనా టికెట్ ఇప్పించుకునేందుకు జలీల్‌ ఖాన్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తన కుమార్తెకు టికెట్ ఇవ్వాల్సిందిగా టీడీపీ పెద్దలకు మొరపెట్టుకున్నాడట. అయితే ఇప్పుడు ఆమె కుమార్తెను తీసుకొచ్చి పోటీ చేయిస్తే జనం ఒప్పుకుంటారా ..? అనే సందేహంలో టీడీపీ ఆలోచిస్తోంది. జలీల్ ఖాన్ కుమార్తెకు అసలు టికెట్ ఇస్తార లేదా అనే విషయాన్ని పక్కనపెడితే బీకాం ఫిజిక్స్ ఎఫెక్ట్ తో జలీల్ తన రాజకీయ జీవితానికి పులిస్టాప్ పెట్టేసుకున్నట్టు అయ్యింది.