రాజధానిని ఇప్పట్లో తరలించడం సాధ్యం కాదని, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు అల్లాడుతుంటే, రాజధానిని ఎలా తరలిస్తామని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు మూడు రాజధానులు అంటూ హడావుడి చేసింది వైసీపీ ప్రభుత్వం.
పరిపాలనా రాజధానిగా విశాఖ అంటూ పెద్దఎత్తున హడావుడి చేసినా, ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది ఎవరికీ అర్థం కాలేదు.అయితే దీని వెనుక చాలా కారణాలు ఉన్నట్లుగానే ఇప్పుడిప్పుడే బయట పడతున్నాయి.
రాజధాని తరలింపు, మూడు రాజధానుల వ్యవహారంపై చాలా సీక్రెట్ గా ఏపీ ప్రభుత్వం సర్వే నిర్వహించగా, అందులో మెజారిటీ ప్రజలు రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లుగా తేలిందట.
దీంతో పాటు విశాఖను రాజధానిగా చేయొద్దంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రావడంతో, జగన్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే, రక్షణ పరంగా చూసుకున్నా అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం అంత శ్రేయస్కరం కాదు అని, కేంద్రం గట్టిగానే సూచించడంతో జగన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.తాజాగా అమరావతి ప్రాంతంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించి, ఎమ్మెల్యే, అసెంబ్లీ, ఎమ్మెల్సీ, క్వాటర్స్ ను సచివాలయ సిబ్బంది క్వాటర్స్ ను పరిశీలించారు.

విశాఖను రాజధానిగా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది అని అనుకుంటున్న సమయంలోనే, బొత్స సత్యనారాయణ అమరావతి ప్రాంతంలో పర్యటించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.ఒకవైపు కేంద్రం, మరోవపు సర్వే లో వచ్చిన రిజల్ట్ ప్రకారం , అలాగే కరోనా సమయంలోనూ, రాజధాని వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం అంత మంచిది కాదనే అభిప్రాయంతో జగన్ ఈ విషయంలో వెనుకడుగు వేసినట్లు గా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ.