భారత సంతతి యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తికి ప్రతిష్టాత్మక పురస్కారం..!!

అమెరికాలోని భారతీయ కమ్యూనిటీకి తలలో నాలుకలా వుంటూ, ఇండో అమెరికా సంబంధాల పటిష్టానికి కృషి చేస్తున్న భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.తన అత్యుత్తమ కెరీర్, ప్రజాసేవలో అంకిత భావానికి గుర్తింపుగా విశిష్ట లీడర్‌షిప్ అవార్డుతో ఆయనను సత్కరించారు.

48 ఏళ్ల రాజా కృష్ణమూర్తి 2017 నుంచి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్‌ నుంచి యూఎస్ ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఇల్లినాయిస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెస్సీ వైట్ ఈ అవార్డును రాజా కృష్ణమూర్తికి అందజేశారు.

రాష్ట్రానికి, మన దేశానికి మీరు చేసిన విశేషమైన సేవకు కృతజ్ఞతగా ఈ అవార్డు అందజేస్తున్నట్లు వైట్ అన్నారు.ఈ విశిష్ట నాయకత్వ పురస్కారాన్ని అందుకున్నందుకు మీకు అభినందనలు అంటూ వైట్ ఒక ప్రకటనలో తెలిపారు.

దీనికి రాజా కృష్ణమూర్తి స్పందిస్తూ.సెక్రటరీ జెస్సీ వైట్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకోవడం తనకు దక్కిన గౌరవమన్నారు.ఇల్లినాయిస్‌లో అత్యంత విజయవంతమైన, సుధీర్ఘకాలం పాటు సేవలందించిన స్టేట్ సెక్రటరీగా, జనరల్ అసెంబ్లీలో మెంటార్‌గా, కోచ్‌గా వైట్ సేవలు శ్లాఘనీయమైనవన్నారు.1959 నుంచి నేటీ వరకు దాదాపు 18,000 మంది యువకుల జీవితాలను గాడిలో పెట్టడానికి జెస్సీ వైట్ టంబ్లింగ్ టీమ్ కృషి చేసిందని రాజా కృష్ణమూర్తి ప్రశంసించారు.ప్రజాసేవకు కట్టుబడి వున్న ప్రతి ఒక్కరికీ, వైట్ అందించిన స్పూర్తికి తాను కృతజ్ఞుడనని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

రాజా కృష్ణమూర్తి న్యూఢిల్లీలో తమిళ కుటుంబంలో జన్మించారు.ఆయనకు మూడు నెలల వయసున్నప్పుడే అతని కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.ఇల్లినాయిస్‌లోని పెయెరియాలో హైస్కూల్ విద్యను, పెయెరియా రిచ్‌వుడ్స్ హైస్కూల్ నుంచి వాలెడిక్టోరియన్‌గా కృష్ణమూర్తి పట్టభద్రులయ్యారు.

ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, హార్వర్డ్ లా స్కూల్‌లోనూ ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.

Advertisement

తాజా వార్తలు