బెల్టు షాపులతో పల్లెల్లో,తండాల్లో ఏరులై పారుతున్న లిక్కర్

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండల కేంద్రంతో పాటు,మండల వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా యధేచ్చగా కొనసాగుతూ లిక్కర్( Liquor ) ఏరులై పారుతోంది.వైన్స్ యాజమాన్యం గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపుల నిర్వాహకులతో అధికారికంగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు.

ఇదే అదునుగా బెల్ట్ షాపుల్లో క్వార్టర్ పై రూ.35 నుంచి రూ.45 వరకు, బీర్లపై రూ.40,ఫుల్ బాటిల్ పై రూ.80 వరకు అధికంగా వసూలు చేస్తూ మద్యం ప్రియుల నుండి భారీగా దండుకుంటున్నారు.ప్రతి మారుమూల గ్రామంలో 6 నుండి 10 వరకు బెల్టుషాపులు నడుస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు( Excise Department ) తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా పల్లెలు, తండాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూపకపోవడంతో ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ బెల్ట్ షాపుల్లో పగలురాత్రి అనే తేడా లేకుండా మద్యాన్ని విక్రయిస్తూ మైనర్ పిల్లల నుండి మొదలు ఆడామగా తేడా లేకుండా లిక్కర్ దందా చేస్తుండడంతో బెల్టు షాపులు(Belt shops ) నిర్వాహకుల వల్ల మద్యానికి అలవాటు పడినవారు కుటుంబ కలహాలతో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కొన్ని బెల్టు షాపులపై స్థానిక పోలీసులు,ఎక్సైజ్ శాఖా అధికారులు అడపాదడపా చర్యలు తీసుకున్నప్పటికీ, కేసులు నమోదు చేసినా నిర్వాహకుల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోగా, మరింత ఎక్కువగా రెచ్చిపోయి అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ లిక్కర్ దందా కొనసాగిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేసి అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని,యువత, ప్రజలు మద్యానికి బానిస కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు
Advertisement

Latest Nalgonda News