ప్రభుత్వంలోని పెద్ద మనుషులు చెప్పడానికి చేసే పనికి చాల తేడా గమనించవచ్చు.పర్యావరణం పట్ల, ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదనిపిస్తుంది.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి మంచి రోజులు కోసం వెతుకుతున్నారు.జులై నెల నుంచి సింగిల్ యూజర్ ప్లాస్టిక్ నిషేధం అన్నారు, దేశంలో ఎక్కడా కనపడలేదు, నవంబర్ నుండి ఫ్లెక్సీలు బంద్ అన్నారు ఎక్కడా అమలుకు నోచుకోలేదు.
పండుగలు, నేతల జన్మదిన శుభాకాంక్షలు, స్వాగతం బ్యానర్లు, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా ప్రతి నగరం కూడలిలో ఫ్లెక్సీల దరిద్రాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు.గత ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యనిషేధం విధిస్తానని చెప్పిన నాయకుడు మద్యాన్ని నియంత్రించాల్సిన వ్యక్తులు పక్క రాష్ట్రాల్లో డిస్టిలరీల ద్వారా పనికిమాలిన బ్రాండ్లు అమ్ముతూ కొత్త లిక్కర్ చట్టం తెచ్చి నిషేధాన్ని సంపూర్ణంగా పాతి పెట్టారు.
ప్లాస్టిక్ తో అందరి జీవితాల్లో విడదీయరాని సంబంధం ఏర్పాటు చేసుకుని అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు.
మనం వాడే చెప్పులు ప్లాస్టిక్,రాసె పెన్ను ప్లాస్టిక్, దువ్వుకునే దువ్వెన ప్లాస్టిక్, మంచినీరు త్రాగే బాటిల్ ప్లాస్టిక్, తినే ప్లేట్ ప్లాస్టిక్.
మార్కెటు కు, సంతకు, నిత్యావసర సరుకులు కొనడానికి సంచి తీసుకువెళ్లడం లేదు.మటన్, చికెన్ షాపులకు కారియర్లు స్టీల్ బాక్సులు తీసుకువెళ్లడంలేదు, మూడు కవర్లలలో మాంసాన్ని తీసుకుపోతున్నారు .ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.ప్లాస్టిక్ కవర్లు మూగ జీవాల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఎంత మొత్తుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు.
పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల చాల మూగజీవాలు చనిపోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.ప్లాస్టిక్ వల్ల పశువులు అకస్మాత్తుగా మరణం బారిన పడుతున్నాయి.
ఇలా చనిపోయిన పశువుల మాంసాన్ని తినడానికి గద్దలు, కాకులు కూడా ఆసక్తి చూపడం లేదు.తద్వారా జీవావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదం.పలుచగా ఉండే ఈ ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ప్లాస్టిక్ కవర్లు డ్రైనేజీలల్లో, మురుగుకాలువలల్లో పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు గురిఅవుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని వదిలించుకోలేక పోతున్నారు.

పశువుల్లో ఉన్న జీర్ణ వ్యవస్థ నిర్మాణం ప్రకారం, ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకుంటున్న విషయం వాటికి తెలిసే అవకాశం లేదు.దీంతో ఆహారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వాటి పొట్టలోకి చేరుతున్నాయి.వీటిని జీర్ణం చేసుకునే శక్తి గానీ, విసర్జించడం ద్వారానో, వాంతి చేసుకోవడం ద్వారానో వాటిని బయటకి పంపించే విధానం గానీ పశువుల్లో లేదు.దీంతో పొట్టలో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్ పేరుకుపోవడంతో అవి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి.
సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం విపరీతంగా మారింది.ప్రతి కార్యంలో చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం అధికమైనది.
ప్రతి కన్వెన్షన్లో, సెమినార్, వర్కుషాప్, సభలు, సమావేశాలు, పెళ్లి ఇలా అన్ని కార్యక్రమాలలో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం ఎక్కువ అయినది.వీటిని నియంత్రించే వారే లేరు.
స్వయం నియంత్రణ తప్ప వేరే మార్గం లేదు.ప్రతి శుభకార్యంలో కనీసం రెండు ట్రాక్టర్ వ్యర్థం బయటపడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు వ్యర్థంతో ఎంత అనర్థం దాగుందో.
సింగల్ యూజ్ ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలి అలాగే ప్లాస్టిక్ సంచులు తీసుకెళుతున్న వ్యక్తులపై జరిమానాలు విధిస్తే ప్రజలు బుద్ధితెచ్చుకుంటారు.
ఎన్నో ఏళ్లుగా ప్రజా సైన్స్ వేదిక జానవిజ్ఞాన వేదిక లాంటి సంస్థల కృషి ఫలించి ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కవర్లను కేంద్ర ప్రభుత్వం జులై 1,నుండి రద్దు చేయడము నిజంగా హర్షించ దగిన విషయం.
ప్రభుత్వము ప్లాస్టిక్ కవర్లనీ నిషేధించడమే కాకుండా వాటిని ఉపయోగించకుండా కఠిన నిర్ణయాలు అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకొని వాటిని ఉపయోగించకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గతంలో కూడా గుట్కా, పాన్ పరాగ్ లు బ్యాన్ చేసినప్పటికీ అవి ఎక్కడో ఒక దగ్గర అమ్ముడు అవుతూనే ఉన్నాయి.అటువంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అదే విధంగా ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ కవర్లను రద్దు చేసుకొని, గుడ్డ సంచులు, చికెన్ మటన్ చేపలు తీసుకెళ్లడానికి టిఫిన్ కారియర్లు ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడడం లో తమ వంతు సహాయపడగలరు.