తెలంగాణలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది.ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదవుతున్న కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయి.
తెలంగాణలో నమోదవుతున్న కేసులు ఒక ఎత్తయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదవుతున్నకేసులే 90 శాతం వరకు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్న మాట.ఇదిలా ఉంటే, తాజాగా సంచలనం రేకెత్తించే విషయం ఇప్పుడు అధికారులు బయటపెట్టారు.రెండు వారాలుగా కరోనా వైరస్ సోకిన రోగులు సుమారు 2200 మంది కనిపించడం లేదంటూ బాంబు పేల్చారు.వీరంతా తప్పుడు ఫోన్ నెంబర్లు, తప్పుడు అడ్రస్ లు ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టించారని, కరోనా రోగులకు ప్రభుత్వం కిట్లను ఇస్తున్న నేపథ్యంలో, ఇంట్లో ఉండే కరోనా చికిత్స పొందుతున్న వారి వివరాలను జిహెచ్ఎంసి అధికారులు సేకరించే పనిలో ఉన్నారు.
ఈ సందర్భంగా వారికి కిట్లు అందించేందుకు ఆ చిరునామాకు వెళ్లినా, ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నా ఫలితం ఉండడం లేదని, వారంతా తప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చారని అధికారులు ఇప్పుడు ప్రకటించారు.ఆధార్ కార్డులో ఉన్న శాశ్వత చిరునామా ఒకటైతే, వారు నివాసం ఉండేది మరోచోట అని, 2200 మంది సరైన అడ్రస్ లు ఇవ్వకుండా తప్పించుకున్నారని బయట పెట్టారు.
వారిని ఇప్పుడు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.వీరంతా యథేచ్ఛగా రోడ్లపైకి వెళ్ళిపోతే వారి ద్వారా ఇతరులకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని జిహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు.

అటువంటి వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని, కరోనా వైరస్ సోకిన వారు తప్పనిసరిగా చికిత్స తీసుకుని, దాని నివారణకు కృషి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.కాకపోతే ఇప్పుడు వీరంతా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేది గుర్తించడం కష్టతరంగా మారింది అని, అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ వార్త గ్రేటర్ పరిధిలోని జనాల్లో టెన్షన్ కలిగిస్తోంది.