ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టుగా తయారయ్యింది రాజకీయ నాయకుల పరిస్థితి.ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతం అవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా ఈ విషయంలో రాజకీయ నాయకులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.
కరుణతో కరోనా తో ప్రజల బాధలు ఒకలా ఉంటే రాజకీయ నాయకుల బాధలు మరోలా ఉన్నాయి.ఇప్పటి వరకు క్షణం తీరిక లేనట్టుగా బిజీగా ఉంటూ వస్తున్న రాజకీయ నాయకులకు కరోనా వైరస్ కారణంగా పూర్తి విశ్రాంతి దొరికినట్టు అయ్యింది.
ఇప్పటి వరకు తీరిక లేకుండా జనాల్లో తిరుగుతూ వస్తున్న నాయకులు ఇప్పుడు ఇళ్లల్లో ఉండలేక, జనాల్లోకి వెళ్ళలేక సతమతం అవుతున్నారు.
చుట్టూ అనుచరులతో కలిసి అధికార దర్పం ప్రదర్శిస్తూ వస్తున్న నాయకులకు ఇప్పుడు పని లేకుండా పోయింది.
అంతే కాదు నాయకులను పలకరించేందుకు వచ్చే వారు కరువవ్వడం తో ఒంటరితనంతో నాయకులు ఫీల్ అవుతున్నారు.ఇక నాయకులు కూడా బయటకి వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు.కరోనా భయం ఎక్కువగా ఉండడంతో బయటకి వస్తే ఎప్పుడు ఎవరి ద్వారా కరోనా వైరస్ తమకు అంటుకుంటుందో అన్న ఆందోళన వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే ఇళ్లకే పరిమితం అయిన తెలంగాణ ప్రజా ప్రతినిధుల విషయంలో సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రజల్లో తిరుగుతూ వారికి అవగాహన కల్పించి కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించేలా చేయకుండా ఇళ్లకే పరిమితం అవుతారా ? ఇందుకేనా మీకు అధికారం కట్టబెట్టింది అంటూ గట్టిగా మందలించడంతో తెలంగాణాలో ప్రజాప్రతినిధులంతా రోడ్లెక్కారు.

అయితే ఇలా రోడ్లెక్కిన వారు కొందరే.మొక్కుబడిగా రోడ్ల మీదకు రావడం తప్ప ఎక్కువ సమయం రోడ్ల మీదకు ఉండేదుకు నాయకులెవ్వరూ ఇష్టపడడంలేదు.నాయకులు రోడ్ల మీదకు వచ్చారంటే సాధారణంగానే జనాలు చుట్టుముట్టడంతో పాటు బాగా దగ్గరగా వచ్చి చేరుతారు.అయితే ఎవరు కరోనా వైరస్ అంటిస్తారో తెలియదు కాబట్టి ఇళ్లల్లో నుంచి ఫోన్ల ద్వారా కథ నడిపిస్తే బెటర్ అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
మరి కొందరయితే తాము కరోనా వైరస్ మీద బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము అన్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.మొత్తానికి కరోనా వైరస్ ప్రభావం నాయకులకు చాలా ఇబ్బందులని తీసుకొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.