కరోనా కట్టడి విషయంలో ఏం చేయాలో ఎలా చేయాలో అటు కేంద్రానికి గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ స్పష్టమైన క్లారిటీ రావడం లేదు.ప్రమాదకర స్థాయిలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ప్రభావం ముందు ముందు మరింత తీవ్రంగా ఉంటుందని, సెప్టెంబర్ నాటికి ప్రమాదకరంగా మారుతుంది అంటూ ప్రకటించింది.అలాగే గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది అంటూ ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళన పెరిగిపోతున్నాయి.
మొదట్లో పట్టణాలకే పరిమితమైనట్టుగా కనిపించినా, ఇప్పుడు మారుమూల గ్రామాలకు సైతం ఈ వైరస్ వ్యాప్తి చెందింది.విదేశాల నుంచి వచ్చే వారి వల్ల, వలస కార్మికులు ఇలా అనేక మార్గాల్లో ఈ వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది.
ఇప్పటికే ఈ సంఖ్య ఎనిమిది లక్షలు దాటింది.మరణాల శాతం కూడా కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.మొదటి రెండు స్థానాల్లో అమెరికా బ్రెజిల్ ఉండగా, భారత్ మూడో స్థానం దక్కించుకుంది.90% కేసులు ఎనిమిది రాష్ట్రాల్లో నమోదవుతున్నట్టుగా, వైద్యఆరోగ్యశాఖ అధికారులు లెక్కలు బయటకి తీశారు.మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ, ప్రమాదకరంగా లేదనేది అధికారుల అంచనా.
ముఖ్యంగా, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తీవ్రంగా ఉంది.లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోయింది.

తెలంగాణ, కర్ణాటకలలో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రత్యేక నిబంధనలను కేంద్రం విధించింది.మహారాష్ట్రలో ఇప్పటికే ఈ కేసుల సంఖ్య రెండున్నర లక్షలకు పైగా చేరింది.మొదట్లో కరోనా వైరస్ ప్రభావం అంతగా ఉండేది కాదు.దేశవ్యాప్తంగా 1000 లోపు మాత్రమే కొత్త కేసులు నమోదు అవుతూ వచ్చాయి.కానీ ఇప్పుడు నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఢిల్లీ, మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తే కొంతలో కొంత ఊరట లభిస్తుందనే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సొంతంగానే లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి.
మరికొన్ని కరోనా ప్రభావం ఉన్న పట్టణాలు, గ్రామాలలో రెడ్ జోన్ నిబంధన విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే టెన్షన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజల్లోనూ నెలకొంది.