టాలీవుడ్‌లో సినిమాలను సరైన సమయం చూసి రిలీజ్ చేయాలని, దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తుందని హీరోలు, దర్శకనిర్మాతలు ఆలోచిస్తారు.కానీ ఈ క్రమంలో ఇతర హీరోల చిత్రాలతో తమ పోటీ ఉండటం, ఈ పోటీలో ఎవరు గెలుస్తారా అనే అంశంపై ఫ్యాన్స్ పందెం ఖాయడం మనం చాలాసార్లు చూశాం.
కాగా స్టార్ హీరోల చిత్రాల మధ్య కూడా ఈ పోటీ నిత్యం నడుస్తుంటుంది.అయితే టాలీవుడ్‌లో పండగలకు రిలీజ్ అయ్యే సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది.
ముఖ్యంగా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ తారాస్థాయిలో ఉంటుంది.
ఈ క్రమంలో వచ్చే సంక్రాంతిని చాలా మంది హీరోలు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ వల్ల సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి.రిలీజ్ కావాల్సిన సినిమాలు మరింత వెనక్కి వెళ్లిపోయాయి.ఇక షూటింగ్ చేసుకుంటున్న సినిమాలు అనుకున్న సమయానికి వచ్చే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.కాగా వచ్చే సంక్రాంతి బరిలో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు మరోసారి కొట్టుకునేందుకు రెడీ అవుతుంటే, వారి మధ్యలో దూరి పండగ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని మరో యంగ్ స్టార్ హీరో చూస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను తొలుత దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నా, ఇప్పుడు అది కుదిరేలా లేదని తెలుస్తోంది.
దీంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.ఇక నందమూరి బాలకృష్ణ-బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోయే సినిమా కూడా సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
అటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఇలా ఇద్దరు సీనియర్ స్టార్స్ తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు చూస్తుంటే, యంగ్ స్టార్ హీరో కూడా వారికి పోటీనిచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే నిజానికి సంక్రాంతికి రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావాల్సి ఉంది.ఆ ఒక్క సినిమా రిలీజ్ అయితే టాలీవుడ్‌లో మరే ఇతర సినిమా కూడా సంక్రాంతికి వచ్చేది కాదు.
కానీ లాక్‌డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ కూడా ఆలస్యం అవుతుందని, వచ్చే వేసవిలో ఆ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత తెలపడంతో, ఇప్పుడు మిగతా హీరోలు సంక్రాంతి బరిలో పోటీపడుతున్నారు.