ఏమిటో ఎవరికి వారు వరాల జల్లులు కురుస్తూనే వస్తున్నారు.ఒక పక్క తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు, ఉద్యోగస్తులకు వరలు ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇక ఏపీ సీఎం జగన్ విషయానికొస్తే, ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జనాలకు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ, జనాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.అయితే ఈ విషయంలో తాను ఏమైనా తక్కువ తిన్నానా అన్నట్లు గా టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఇప్పుడు వరాల జల్లు కురిపిస్తున్నారు.
అయితే ఆ వరాల జల్లులు ప్రజలపై కాదు పార్టీ నాయకులపై.చాలా కాలంగా పార్టీ కేడర్ నిరాశ, నిస్పృహల్లో ఉండడంతో ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అయినా ఏదో అసంతృప్తి పార్టీ నాయకుల్లో ఉంది.
మరి కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు చంద్రబాబు పెద్ద ఎత్తున రాష్ట్ర, జాతీయ కమిటీలను నియమించారు.
పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పదవులను భర్తీ చేశారు.ఎప్పుడు లేని స్థాయిలో తెలుగు దేశంలో ఒక మోస్తారు నాయకులందరికీ పదవులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పార్టీలో కొత్త ఉత్సాహం పెరిగిందని బాబు అంచనా వేస్తున్నారు.ఇటీవలే 23 లోక్ సభ నియోజకవర్గాలకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించారు.అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు కన్వీనర్లను నియమించారు.

రాష్ట్ర కమిటీ లు, పొలిట్ బ్యూరో ఇలా ఎన్నో పదవులను పార్టీ నాయకులకు కేటాయించారు.ఈ పదవులను సామాజిక వర్గాల వారీగా భర్తీ చేసారు.ఇందులో బీసీలకు ఎక్కువగా పెద్దపీట వేశారు.
ఎక్కడా ఎవరికి అసంతృప్తి తలెత్తకుండా చేశారు.కొంతమంది నేతలు తమకు పదవులు దక్కలేదనే అసంతృప్తితో ఉండడంతో, మళ్ళీ ప్రతి 5 పార్లమెంటు స్థానాలకు ఒక జోన్ ఏర్పాటు చేసి, ఐదుగురు నేతలకు బాధ్యతలను అప్పగించారు.
అంటే పార్టీ పదవులను భర్తీ చేసేందుకు సరి కొత్త పదవులను సృష్టిస్తూ, పార్టీ నాయకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇటీవల ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి అరకు పార్లమెంట్ నియోజకవర్గాలను, అలాగే పంచుమర్తి అనురాధ కు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు నియోజకవర్గాలను, బత్యాల చెంగల్రాయుడు కి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాలను, అనగాని సత్య ప్రసాద్ కు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాలకు, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి కి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూల్, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.
పార్టీ మారుతారు అనే అనుమానం ఉన్న వారికి, కీలక నాయకులు అనుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పదవి ఇచ్చేందుకు చంద్రబాబు ఈ స్థాయిలో టిడిపిలో కొత్త పదవులను సృష్టిస్తూ, ఎవరికీ, ఎక్కడా అసంతృప్తి లేకుండా చేసుకుంటున్నారు.
దీంతో పార్టీ నేతల కోసం చంద్రబాబు కొత్త స్కీమ్ ఏర్పాటు చేశారని, ఆ స్కిమ్ లో పదవులు ఎన్నికలు వచ్చే వరకు ఇస్తూనే ఉంటారు అని, ఎవరు అడిగినా, కాదు లేదు అనకుండా కొత్త కొత్త పదవులను సృష్టిస్తూనే ఉంటారు అంటూ రాజకీయ సెటైర్లు చంద్రబాబుపై పేలుతున్నాయి.