గతేడాది సరిగ్గా ఇదే నెలలో దేశమంతటా లాక్ డౌన్ విధించి, జనాలు ఎవరూ రోడ్లపైకి రాకుండా పూర్తిగా దేశమంత లాక్ చేసేసారు.కరోనా వైరస్ ప్రభావం భారత్ తో పాటు, ప్రపంచవ్యాప్తంగా తీవ్రతరం కావడం, అన్ని దేశాలు ఈ వైరస్ ప్రభావంతో అతలాకుతలం అవడం వంటి కారణాలతో ప్రపంచమంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా నరకయాతన అనుభవించారు.ఇక వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఏదైతేనేమి కరోనా ప్రభావం భారత్ లో తగ్గుముఖం పట్టడం, లాక్ డౌన్ సడలింపు విధించడం వంటివి జరిగాయి.మళ్లీ ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
ఎక్కడికక్కడ కేసులు పెరుగుతున్నాయి.
బ్రెజిల్ వంటి దేశాల్లో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది.
ఇక భారత్ లోనూ ఈ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి.ప్రభుత్వం బయటపెడుతున్న లెక్కల కంటే, రెట్టింపు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నట్లు అనేక లెక్కలు బయటకు వచ్చాయి.
ఇప్పటికే కొన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేయగా, మనదేశంలోనూ లాక్ డౌన్ విధింపు దిశగా కొన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు.

కర్ణాటక అయితే పూర్తిగా కేరళ సరిహద్దులను మూసివేసింది.మనదేశంలో మొదట్లో కేరళలో కరోనా కేసులు బయటపడగా, ఇప్పుడు అదే కేరళలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.ఒకవైపు భారత్ లో కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ నుంచే విదేశాలకు ఈ వ్యాక్సిన్ ఎగుమతి అవుతోంది.అయినా అంతే స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతూ ఉండడం ఆందోళన పెంచే విషయమై.
కేసుల సంఖ్య మరింత ఉద్ధృతం అయితే, భారత్ లో మరోసారి లాక్ డౌన్ తప్పదు అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి.