బోటు- వేటు : పర్యాటక మంత్రికి పదవి గండం తప్పదా ?

పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన రాయల వశిష్టా అనే బోటు కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురయ్యి దాదాపు నలభై మంది వరకు మృత్యువాత పడడం, ఇప్పటికీ కొన్ని మృతదేహాలను వెలికి తీయలేకపోవడం ఇవన్నీ ఏపీ అధికార పార్టీ వైసీపీ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఇదే సమయంలో మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం కూడా వైసీపీ ఖాతాలోనే పడిపోయింది.

ఇక బోటు ప్రమాదం వ్యవహారం జరిగిన దగ్గర నుంచి చురుగ్గానే అన్ని ఏర్పాట్లు చేస్తూ తమ మీద పడ్డ మరకలను తొలిగించుకునే పని చేపట్టింది వైసీపీ ప్రభుత్వం.కానీ ఇంతలోనే బోటు ప్రమాద ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కొత్త రచ్చ మొదలయినట్టుగా కనిపిస్తోంది.బోటు ప్రమాద ఘటన జరిగిన సమయంలో బోటులో 73 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని అధికారులు చెబుతున్నారని,కానీ ప్రమాద సమయంలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారంటూ హర్షకుమార్ ఆరోపించారు.

  ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై అనుమతి ఇవ్వలేదని, దీంతో మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్లు చేయించి బోటుకు పర్మిషన్ ఇచ్చేలా చేశారని హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పడవ ప్రమాదానికి అవంతి శ్రీనివాస్ కారణమనే వార్తలు బలంగా వస్తుండడంతో ఆయనపై జగన్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది.ఇక రాయల వశిష్టా బోటు యజమాని వెంకటరమణ విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తే కావడం, మంత్రి గారి సామజిక వర్గానికే చెందిన వ్యక్తి కావడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

Advertisement

బోటు యజమాని వెంకటరమణ ప్రస్తుతం జనసేన నాయకుడిగా ఉన్నారు.అయినా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ గోదావరిలో బోటు వ్యాపారం నిర్వహిస్తూనే ఉన్నారు.పైగా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు తనకు పరిచయం ఉన్న అవంతి శ్రీనివాస్ టూరిజం మంత్రి కావడంతో వెంకటరమణకు మరింత కలసి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

  ఇదే విషయమై జగన్ ప్రమాద సంఘటనకు వచ్చిన సమయంలో కొంతమంది నాయకులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.దీనిపై జగన్ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.దీనిలో భాగంగానే అవంతి శ్రీనివాస్ ను ఆ శాఖ నుంచి జగన్ తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది.

ఇదే విషయమై సీనియర్ మంత్రులు, కీలక నాయకులతో జగన్ చర్చించినట్లు సమాచారం.అయితే ఇప్పటికే పడవ ప్రమాద ఘటనపై కమిటీ వేసినందున ఆ రిపోర్ట్ వచ్చే వరకు ఎటువంటి చర్యలు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇక హర్షకుమార్ వ్యాఖ్యలపై మంత్రి అవంతి మండిపడుతున్నారు.హర్షకుమార్ రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తనపై అసత్య ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు