తెలంగాణ బిజెపి గతంతో పోలిస్తే బాగా బలపడినట్టు గానే కనిపిస్తున్నా, కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటోంది.టిఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, తామే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు అభిప్రాయపడుతూ వచ్చారు.
ఎలాగూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి, తమకు తప్పకుండా అవకాశం దక్కుతుందనే అంచనాల్లో ఉండగానే ఆకస్మాత్తుగా కాంగ్రెస్ లైన్ లోకి వచ్చింది.రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కడం, ఆ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో పూర్తిగా తన మార్క్ కనిపించే విధంగా రేవంత్ సరికొత్త వ్యూహాలతో అధికార పార్టీకి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు.
అసలు తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని , ఇక ఆ పార్టీ తమకు ఏమాత్రం పోటీ కాదు అని ,మిగతా పార్టీలు అభిప్రాయపడుతున్న సమయంలోనే కాంగ్రెస్ లో రేవంత్ కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చారు.
అంతేకాదు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలో చేరిన నేతలను, అలాగే బిజెపి టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి నేతలను కాంగ్రెస్ వైపు తీసుకువచ్చే విషయంలో రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతుండడం వంటి పరిణామాలపై బిజెపి కలవరానికి గురి అవుతోంది.
ఎందుకంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా ఉందని తేలడంతో, ఆ పార్టీ అలర్ట్ అయింది.ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎవరు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, కూనా శ్రీశైలం గౌడ్ , విక్రమ్ గౌడ్ వంటి నేతలు రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతుండడం తో వారిని అటువైపు వెళ్ళకుండా బీజేపీలో కొంతమంది కీలక నేతలు రంగంలోకి చర్చలు జరిపినట్లు సమాచారం.అలాగే కొంతమందిని ఢిల్లీకి తీసుకెళ్లి మరి బుజ్జగించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో బలపడుతున్న సమయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు ఉంటే మొదటికే మోసం వస్తుందని , పార్టీలో చేరే వారి సంగతి పక్కన పెడితే , ఉన్న నేతలను కాపాడుకోవడం కష్టమనే ఆలోచనతో బీజేపీ అగ్రనేతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని కొంతమంది బిజెపి సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలిచే వరకు ఈ వలసల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, వలసలు పెరిగితే బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు పై ప్రభావం చూపిస్తుందని , రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఎవరు పార్టీని వీడి వలస వెళ్లకుండా నిరోధించేందుకు బిజెపి ఇంతగా టెన్షన్ పడుతొందట.