ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి తల్లి, తండ్రి ఆశపడుతుంటారు.ఆ విధంగానే తమ పిల్లల చేత మొదటగా అక్షరాభ్యాసం చేయించేందుకు చదువుల తల్లి, జ్ఞాన సరస్వతి దేవాలయం అయిన బాసర కి వెళ్తారు.
మనదేశంలో రెండు ప్రసిద్ధి చెందిన సరస్వతి దేవాలయాలలో ఒకటిగా బాసర ఎంతో ప్రసిద్ధి చెందినది.ప్రతి సంవత్సరం ఇక్కడికి ఎంతో మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.
వసంత పంచమి రోజు ఆ సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యమైన రోజు.ఆరోజున కొత్తగా చదువును ప్రారంభించేటటువంటి పిల్లలకు తమ తల్లిదండ్రులు బాసరకు తీసుకువెళ్లి అక్కడ అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు చదువులో మంచి విజయం సాధిస్తారని నమ్ముతారు.
అందువల్ల ప్రతి సంవత్సరం వసంత పంచమిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తమ పిల్లలను తీసుకొని ఇక్కడే అక్షరాభ్యాసం చేయిస్తారు.
మన పురాణాల ప్రకారం వ్యాసమహర్షి, అతని శిష్యులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఒక చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలని భావిస్తారు.
అలాంటి వాతావరణం వెతకడం కోసం వ్యాసమహర్షి దండక అనే అరణ్యానికి వెళ్తారు.అక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉండటంతో ఆ అడవిలో నివాసం ఉండాలని భావిస్తారు.
వ్యాసమహర్షి ఆ దండకారణ్యంలో తన వ్యాసాలతో, ప్రార్థనలతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆ ప్రాంతాన్ని వసారా అని పిలిచారు.కాలానుగుణంగా వసారా అన్న పదం నుంచి బాసర ఉద్భవించింది.
ఒకరోజు గోదావరి నదిలో స్నానమాచరిస్తున్న వ్యాసమహర్షికి సరస్వతి దేవిసాక్షాత్కరించి, భూలోకం మీద తన నివాస స్థానం బాసరేనని అక్కడ తన విగ్రహాన్ని రూపొందించాలని వ్యాస మహర్షికి చెప్పడంతో వ్యాసమహర్షి ప్రతిరోజు ఒక పిడికెడు మట్టి తో అమ్మవారి సైకత శిల్పాన్ని రూపొందిస్తాడు.ఆ రూపమే ఇప్పుడున్న అమ్మవారి మూలవిరాట్ అని పురాణ కథలు గా చెబుతారు.
ఇలా ప్రసిద్ధి చెందిన సరస్వతి అమ్మవారికి వసంత పంచమి వంటి ప్రత్యేక రోజులలో ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తారు.ఆరోజు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి సందర్శించి వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో విశేషం.